బన్నీ చెప్పిన ప్రిన్సిపల్-ప్రెసిడెంట్ పోలిక

‘పుష్ప’ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్న అల్లు అర్జున్ ఆనందం మామూలుగా లేదు. అవార్డు ప్రకటించినపుడే బన్నీ ఎలా సంబరాలు చేసుకున్నాడో తెలిసిందే. ఆ సందర్భంగా తన ఆనందాన్నంతా మాటల రూపంలో బయటపెట్టాడు. ఇటీవలే ఢిల్లీకి వెళ్లి అవార్డు అందుకుని వచ్చిన బన్నీ మళ్లీ మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు ఏర్పాటు చేసిన అభినందన వేడుకల్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతను చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.

ముఖ్యంగా స్కూల్ రోజులను గుర్తు చేసుకుంటూ ప్రస్తుతం తన ఎదుగుదలను పోలుస్తూ అతను మాట్లాడిన సరదా మాటలు అందరినీ నవ్వించాయి. ‘పుష్ఫ’కు గాను బన్నీతో పాటు దేవి కూడా ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేవిని పక్కన పెట్టుకుని ఒక ఆసక్తికర కామెంట్ చేశాడు బన్నీ.

చెన్నైలో చిన్నపుడు కలిసి చదువుకున్న రోజుల్లో అల్లరి వాళ్లమని.. నాటు భాషలో చెప్పాలంటే చెన్నైలో పోరంబోకుల్లా తిరిగి తామిద్దరం ఇప్పుడు జాతీయ అవార్డులు అందుకోవడం విచిత్రమని.. ఇదే విషయం తన తండ్రి చెప్పి జోక్ పేల్చారని బన్నీ అన్నాడు. అలాగే చెన్నైలో తనతో కలిసి చదువుకున్న మరో ఫ్రెండ్ ఫోన్ చేసి స్కూల్లో ప్రిన్సిపల్ దగ్గర టీసీలు తీసుకోవడమే తెలిసిన నువ్వు.. ఇప్పుడిలా ప్రెసిడెంట్ దగ్గర మెడల్ తీసుకోవడం ఏంటి అంటూ, ఇది తనకెంతో బాధ కలిగిస్తోందని అన్నాడని బన్నీ గుర్తు చేసుకున్నాడు.

మరోవైపు తనకు అవార్డు రావడంలో మేజర్ క్రెడిట్ సుకుమార్‌కే దక్కుతుందని బన్నీ అన్నాడు. తనకు అవార్డు రావాలని తనతో పాటు చుట్టూ ఉన్నవాళ్లు కోరుకున్నారని.. సుకుమార్ తనకన్నా ఎక్కువ కోరుకున్నాడని.. అందుకే తనకు అవార్డు వచ్చిందని.. తాను ఈ స్థాయిలో ఉండటానికి సుకుమారే కారణమని.. తాను అచీవ్మెంట్ అయితే.. సుకుమార్ అచీవర్ అని తన ఫేవరెట్ డైరెక్టర్ని కొనియాడాడు బన్నీ.