నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా తన మొదటి సినిమా చిలసౌతోనే విమర్శకుల ప్రశంసలు పొందిన సంగతి తెలిసిందే. సుశాంత్ కెరీర్ లోనే పెద్ద హిట్ అది. ఎంత సక్సెస్ అంటే నాగార్జునని మన్మథుడు 2 చేయడానికి ఒప్పించేంత. అయితే అది ఆశించిన విజయం అందుకోలేకపోవడంతో రాహుల్ కొంత గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు రష్మిక మందన్న ప్రధాన పాత్రలో గీతా ఆర్ట్స్ సమర్పణలో ఒక డిఫరెంట్ మూవీ చేయబోతున్నాడు. దాని పేరే ది గర్ల్ ఫ్రెండ్. ప్యాన్ ఇండియా భాషలకు అనుకూలంగా ఉండేందుకు ఇంగ్లీష్ టైటిల్ పెట్టుకున్నారు. చిన్న టీజర్ వదిలారు.
కాన్సెప్ట్ పెద్దగా రివీల్ చేయకపోయినా నీటి మడుగులో రష్మిక మందన్న మౌనంగా ఉంటూ ఒక్కసారిగా హావభావాలు మార్చే చిన్న బిట్ తో కథ గురించి ఎక్కువ ఊహించుకోకుండా సస్పెన్స్ లో పెట్టారు. చూస్తుంటే ఇదేదో రెగ్యులర్ రొమాంటిక్ మూవీలా అనిపించడం లేదు. మరో ప్రధానమైన విశేషం సంగీతం సమకూరుస్తున్నది హేశం అబ్దుల్ వహాబ్. విజయ్ దేవరకొండ ఖుషి తర్వాత ఈ మలయాళం సెన్సేషన్ కి వరస ఆఫర్లు దక్కుతున్నాయి. ఆల్రెడీ నాని హాయ్ నాన్న కావాల్సిన బజ్ తెచ్చేసుకుంది. స్పార్క్, శర్వానంద్ 35 సంగీతం కూడా తనే. ఇంకో రెండు మూడు ఫైనలయ్యె స్టేజిలో ఉన్నాయి.
ది గర్ల్ ఫ్రెండ్ క్యాస్టింగ్ కు సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి క్లూస్ లేవు. హీరో ఓరియెంటెడ్ కాదు కాబట్టి రష్మికనే మెయిన్ హైలైట్ గా నిలవబోతోంది. కృష్ణ వసంత్ ఛాయాగ్రహణం అందిస్తారు. రాహుల్ రవీంద్రన్ కి దీని సక్సెస్ చాలా కీలకం. ఒక్క డిజాస్టర్ ఇండస్ట్రీ అవకాశాలను ప్రభావితం చేస్తున్న ట్రెండ్ లో ఇతను బాగా ఎదురు చూడాల్సి వచ్చింది. ది గర్ల్ ఫ్రెండ్ తో మళ్ళీ కొత్తగా నిరూపించుకోవాల్సిందే. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళబోతున్న ఈ సినిమాకు విద్య కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ భాగస్వామ్యంలో మరో మూడు సినిమాలు రాబోతున్నాయి