ఆర్ఎక్స్ 100తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు అజయ్ భూపతి. తన తొలి చిత్రానికి వెరైటీ టైటిల్ పెట్టిన అజయ్.. రెండో సినిమాకు మహాసముద్రం అనే మంచి వెయిట్ ఉన్న టైటిల్ పెట్టాడు. కానీ అది సరైన ఫలితాన్నివ్వలేదు. మూడో చిత్రానికి మంగళవారం అనే మరో డిఫరెంట్ టైటిల్ పెట్టాడు. ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి కలగడానికి తొలి కారణం టైటిలే. ఆ టైటిల్‌తో ముడిపడి ఒక బూతు సామెత ఉండటంతో.. బోల్డ్ డైరెక్టర్‌గా పేరున్న అజయ్ భూపతి ఆ కోణంలోనే టైటిల్ పెట్టాడేమో అన్న సందేహాలు కలిగాయి.
కానీ మంగళవారం ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో టైటిల్ విషయమై అతను వివరణ ఇచ్చాడు. అందరూ అనుకుంటున్న బూతు సామెతకు ఈ టైటిల్‌కు ఏ సంబంధం లేదని అజయ్ స్పష్టత ఇచ్చాడు. సోషల్ మీడియాలో టైటిల్ గురించి రకరకాలుగా అనుకుంటుండటం చూశానని.. కానీ సినిమా చూస్తే ఆ ప్రచారాలకు టైటిల్‌కు సంబంధం ఏమీ లేదని అర్థమవుతుందని అజయ్ తెలిపాడు. ఈ చిత్రానికి ఇది యాప్ట్ టైటిల్ అని.. రేప్పొద్దున సినిమా చూసినపుడు అది ప్రేక్షకులకు బాగా అర్థమవుతుందని అజయ్ తెలిపాడు.
ఇక ఈ సినిమా కథ గురించి చెబుతూ.. ఇండియాలో ఇప్పటిదాకా ఎవరూ టచ్ చేయని పాయింట్‌ను తాను టచ్ చేశానని నమ్ముతున్నానని అజయ్ తెలిపాడు. ఆర్ఎక్స్ 100లో ఒక కొత్త కథను చూసి ప్రేక్షకులు గొప్పగా ఆదరించారని.. మంగళవారం సినిమాలో కూడా అలాంటి కొత్త కథనే చూసి ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారని నమ్మకం ఉందని అజయ్ తెలిపాడు. తన రెండో సినిమా మహాసముద్రం ఫ్లాప్ అయినప్పటికీ.. అది తీసింది కూడా తానే కాబట్టి దాన్ని ఇష్టపడతానని.. అందుకే పోస్టర్ మీద ఆ సినిమా పేరు కూడా వేశానని అజయ్ చెప్పాడు. త్వరలో తాను కార్తికేయ హీరోగా ఓ భారీ చిత్రం చేయనున్నట్లు అజయ్ వెల్లడించాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates