ఎంతో ఇష్టపడి కష్టపడి రాసుకున్న స్క్రిప్ట్ మీద దర్శకులకు ఎంతైనా నమ్మకం ఉండొచ్చు. నిడివి ఎక్కువ ఉంటే ప్రేక్షకులు ఇంకా బాగా ఆస్వాదిస్తారనే ధీమా కలగొచ్చు. కానీ ప్రాక్టికల్ గా ఆలోచించకపోతే అది ఏకంగా ఫలితం మీదే ప్రభావం చూపిస్తుంది. గతంలో నాని అంటే సుందరానికి లెన్త్ మరీ ఎక్కువయ్యిందని, ఒక ఇరవై నిముషాలు ట్రిమ్ చేస్తే ఆడియన్స్ కి ఇంకా బాగా కనెక్ట్ అవుతుందని మీడియా, ప్రేక్షకులు ఇద్దరూ అభిప్రాయపడ్డారు. కానీ వివేక్ ఆత్రేయ ఒప్పుకోలేదు. తాను అనుకున్న రెండు గంటల యాభై అయిదు నిమిషాల నిడివికే కట్టుబడ్డాడు. ఫలితంగా బ్రేక్ ఈవెన్ కాలేదు.
తాజాగా టైగర్ నాగేశ్వరరావుకు ఇదే సమస్య వచ్చింది. కంటెంట్ మరీ దారుణంగా లేదు. యావరేజే. కానీ సెకండ్ హాఫ్ లో మోతాదుకి మించి ఫైట్లు, ఎమోషనల్ సీన్స్ పెట్టేయడంతో జనాలకు విపరీతంగా బోర్ కొట్టేసింది. పీ రిలీజ్ ప్రమోషన్లలో దర్శకుడు వంశీ ఇంకో గంట ఉన్నా చూసేంత గొప్పగా కంటెంట్ ఉందని అతిశయోక్తి పోయాడు. తీరా చూస్తే అదే పెద్ద మైనస్ అయ్యింది. అంటే మూడు గంటలు థియేటర్లలో కూర్చునే ఓపిక పబ్లిక్ కి లేదా అంటే నిక్షేపంగా ఉంది. అర్జున్ రెడ్డి, ఆర్ఆర్ఆర్ లు బ్లాక్ బస్టరయ్యాయి. రంగస్థలం, మహానటిలు నూటా అరవై నిమిషాలతో కుర్చీలకు కట్టిపడేశాయి.
ఇలా చెప్పుకుంటే లెక్కలేనన్ని ఉదాహరణలు ఉన్నాయి. అసలు ఫైనల్ కాపీ సిద్ధమయ్యాక నిజంగా మూడు గంటల నిడివి డిమాండ్ చేస్తోందా ఎక్కడైనా ల్యాగ్ వస్తోందాని దర్శకుడు, నిర్మాత కలిసి ఇతరులకు షో వేసినప్పుడు నిక్కచ్చిగా నిర్ణయం తీసుకోవాలి. పానకం ఎంత తీయగా గ్లాసుడు తాగగలం కానీ ట్యాంక్ మొత్తం తాగితే ఆసుపత్రి బెడ్డు చేరాల్సిందే. అదే దాహం వేసినప్పుడు, వర్కౌట్స్ చేసినప్పుడు మంచి నీళ్లు ఎక్కువ తాగినా నష్టం లేదు. ఇది గుర్తించనంత కాలం నిడివే సినిమాల పాలిట శాపంగా మారి అన్యాయంగా వసూళ్ల మీద ప్రభావం పడి నిర్మాత చేతులు కాలడం ఖాయం.