శంకర్ మీద వందల కోట్లు పెట్టేదెవరు

ఒకప్పుడు భారతీయ స్పిల్బర్గ్ గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే సినిమాలు తీసిన దర్శకుడు శంకర్ ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో చూస్తున్నాం. తమిళ సినిమాల డబ్బింగ్ హక్కుల రేట్లు లక్షల నుంచి కోట్లకు తీసుకెళ్లిన స్థాయి నుంచి ఇప్పుడాయన పేరు వింటేనే హీరోలు అనుమానపడే దాకా వచ్చింది. ఇండియన్ 2 దారుణంగా పోయింది. గేమ్ ఛేంజర్ ఇంకా అన్యాయం. కమల్ హాసన్, రామ్ చరణ్ నమ్మకాన్ని, ఏళ్ళ తరబడి వాళ్ళ కష్టాన్ని నిలువునా ముంచేశారు. ఒకప్పుడు భారతీయుడు, జెంటిల్ మెన్, ఒకే ఒక్కడు, రోబో లాంటి మాస్టర్ పీసెస్ తీసిన దర్శకుడు ఈయనేనా అని మూవీ లవర్స్ ఫీలయ్యారు.

ఇదిలా ఉండగా శంకర్ డ్రీం ప్రాజెక్టు వేల్పరి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని చెన్నై వర్గాల్లో ఒక టాక్ వినిపిస్తోంది. ప్రొడక్షన్ హౌస్ ఏంటో తెలియదు. పెద్ద స్టార్ హీరో అంటున్నారు తప్ప పేరు రివీల్ చేయడం లేదు. 2026 వేసవిలో మొదలైపోతుందంటూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. వేల్పరి మీద శంకర్ సీరియస్ గా ఉన్న మాట నిజమే కానీ ఇప్పుడీ ప్రాజెక్టు మీద వందల కోట్లు పెట్టే నిర్మాత ఎవరన్నది పెద్ద క్వశ్చన్. ఎందుకంటే ఆయన ఓటిటి మార్కెట్ కూడా రిస్కులో పడింది. ఇండియన్ 3 పూర్తి చేద్దామంటే ఇటు లైకా సంస్థ, అటు ఓటిటి కంపెనీలు సుముఖత చూపించడం లేదు.

అలాంటప్పుడు వేల్పరికి మార్కెట్ తెచ్చుకోవడం అంత సులభం కాదు. పొన్నియిన్ సెల్వన్ తరహాలో పురాతన యుద్ధ వీరుల కథతో రూపొందే ఈ విజువల్ గ్రాండియర్ రెండు మూడు భాగాలు తీయాల్సి వస్తుందట. ఇక్కడే పెద్ద రిస్క్ ఉంది. ఒకవేళ ఫస్ట్ పార్ట్ ఫ్లాప్ అయితే రెండోదాన్ని ఎవరూ పట్టించుకోరు. ఇండియన్ అదే పరిస్థితిని ఎదురుకుంటోంది. అయినా వేల్పరి నిజంగా కార్యరూపం దాల్చినా హీరో ఎవరనేది పెద్ద సస్పెన్స్. విజయ్, రజనీకాంత్, అజిత్ చేయరు. సూర్య, విక్రమ్, శివ కార్తికేయన్ లాంటి వాళ్లకు అంత పెద్ద మార్కెట్ లేదు. మరి శంకర్ ఎవరిని ఒప్పిస్తారనేది వేయి డాలర్ల ప్రశ్న.