అఫీషియల్… అఖండ 2కి ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్

అనుకున్నట్టే అఖండ 2 తాండవం టికెట్ ధరల పెంపుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ముందు రోజు డిసెంబర్ 4 వేయబోయే ప్రీమియర్లకు 600 రూపాయలు ఫ్లాట్ టికెట్ రేట్ నిర్ణయించారు. డిసెంబర్ అయిదు నుంచి పది రోజుల పాటు సింగల్ స్క్రీన్ 75 రూపాయలు, మల్టీప్లెక్స్ 100 రూపాయలు ప్రతి టికెట్ మీద పెంచుకునేలా అనుమతులు ఇచ్చారు. పదకొండో రోజు నుంచి రెగ్యులర్ రేట్లు అందుబాటులో ఉంటాయి. రోజుకు అయిదు షోల చొప్పున అనుమతించడం వల్ల ఉదయం ఏడు లేదా తొమ్మిది గంటలకు ఎక్స్ ట్రా ఆట వేసుకోవడానికి థియేటర్లకు వెసులుబాటు ఉంటుంది.

ఇక తెలంగాణ నుంచి జివో రావాల్సి ఉంది. ఇంచుమించు దీన్నే ఫాలో అయ్యే అవకాశముంది. కార్మికుల నిధికి పాతిక శాతం ఇస్తేనే పెంపుకి అనుమతి ఇస్తామని జూబ్లీ హిల్స్ ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో అది అఖండ 2 నుంచే అమలవుతుందా లేక కొత్త గైడ్ లైన్స్ వచ్చేదాకా ఆ నిర్ణయం పెండింగ్ లో పెడతారా చూడాలి. టెక్నికల్ గా చూసుకుంటే ఇప్పటికిప్పుడు ఆ కండీషన్ వర్తించదని, విధి విధానాలను రూపొంచాల్సి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. ఏదైనా రేపే ఫైనల్ చేయాలి. అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టాల్సి ఉన్నందున ఆలస్యం చేయడానికి లేదు.

సో ఓజి తరహాలో అఖండ 2 ముందే చూసే అవకాశం అభిమానులకు దక్కుతోంది. వరసగా నాలుగు సూపర్ హిట్ల తర్వాత బాలయ్య చేస్తున్న మూవీ కావడంతో అంచనాలు మాములుగా లేవు. అయితే బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా పుష్ప, కెజిఎఫ్, బాహుబలి రేంజ్ లో సౌండ్ లేదని కొందరు ఫ్యాన్స్ ఫీలవుతున్నారు కానీ నిర్మాతలు, దర్శకుడు బోయపాటి శీను మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. చివరి నిమిషం ఒత్తిళ్లు లేకుండా యుఎస్ ప్రింట్లను డిస్పాచ్ చేశారు. ప్రీమియర్లకు ఒక్క నిమిషం ఆలస్యం లేకుండా షోలు పడిపోతాయి. సో ఇంకో యాభై గంటల్లో బాలయ్య తొలి తాండవం తెలుగు రాష్ట్రాల్లో మొదలుకానుంది.