నిన్న మొదలైన దసరా సినిమాల హంగామాలో భగవంత్ కేసరి, లియోలు మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ దక్కించుకున్నాయి. బాలయ్య 32 కోట్ల గ్రాస్ సాధించినట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించగా విజయ్ తెలుగు వెర్షన్ నుంచే 16 కోట్లు రాబట్టినట్టు సితార సంస్థ అఫీషియల్ గా చెప్పింది. ఇవి మంచి నెంబర్లే. కంటెంట్ పరంగా రెండింటికి మంచి టాకే వచ్చింది. అయితే భగవంత్ కేసరికి ఫ్యామిలీ ప్రేక్షకుల మద్దతు దక్కే అవకాశాలు పెరగగా లియోకి మాస్ సపోర్ట్ మాత్రమే కనిపిస్తోంది. విక్రమ్, ఖైదీ స్థాయిలో లేకపోవడం పట్ల అభిమానులు పెదవి విరుస్తున్న మాట వాస్తవం.
టైగర్ నాగేశ్వరరావు టాక్ ఆశాజనకంగా లేకపోవడం పై రెండు సినిమాలకు ప్లస్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మొదటి వీకెండ్ తో పాటు తర్వాత వచ్చే పండగ సెలవులు చాలా కీలకం కాబోతున్నాయి. బుకింగ్స్ ట్రెండ్ గమనిస్తుంటే బాలయ్య పై చేయి కావడం స్పష్టమే అయినా మరీ లెజెండ్, అఖండ రేంజ్ లో వసూళ్ల ఊచకోత ఉండకపోవచ్చనే కామెంట్స్ ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అనిల్ రావిపూడి గత చిత్రాలు రాజా ది గ్రేట్, సరిలేరు నీకెవ్వరు సైతం మొదటి రోజే యునానిమస్ హిట్ అనిపించుకున్నవి కాదు. క్రమంగా సూపర్ హిట్ జోన్ లోకి వెళ్లిపోయాయి.
ఇక బాలీవుడ్ మూవీ గణపథ్ ని తెలుగు రాష్ట్రాల ఆడియన్స్ పట్టించుకోలేదు. హిందీ రివ్యూలు నెగటివ్ గా ఉండటంతో దాని మీద ఉన్న కాసింత ఆసక్తి కూడా సన్నగిల్లిపోయింది. సో భగంవత్ కేసరి, లియోలు తమకు దొరికిన గోల్డెన్ ఛాన్స్ ని ఏ మేరకు వాడుకుంటాయో చూడాలి. ఇవాళ హైదరాబాద్ లో బాలయ్య టీమ్ సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించగా రేపో ఎల్లుండో లియో కూడా తమ విజయానందాన్ని పంచుకోబోతోంది. ఇక టైగర్ నాగేశ్వరరావు స్టేటస్ స్పష్టంగా తెలియాలంటే ఆదివారం దాకా వేచి చూడాలి. ఫైనల్ గా మాట్లాడేది వసూళ్లే కాబట్టి వాటి ప్రాతిపదికన విజేత డిసైడవుతాడు.