మగాడు అనిపించుకునే ‘ఫ్యామిలీ స్టార్’  

రౌడీ బాయ్ గా అగ్రెసివ్ హీరోయిజంతో చేసిన ప్రయత్నాలు అచ్చిరాకపోవడంతో విజయ్ దేవరకొండ తిరిగి తన గీత గోవిందం స్కూల్ కు వచ్చేశాడు. ఖుషి ఆశించిన స్థాయిలో గొప్ప ఫలితం అందుకోనప్పటికీ హీరోగా తన స్థాయిని కాపాడటంలో సక్సెస్ అయ్యింది. లైగర్ గాయాన్ని మాన్పడానికి దోహదపడింది. ఇప్పుడు మరోసారి కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యే ఉద్దేశంతో ఫ్యామిలీ స్టార్ గా రాబోతున్నాడు. సర్కారు వారి పాట తర్వాత దర్శకుడు పరశురామ్ పేట్ల ఈసారి నిర్మాత దిల్ రాజుతో చేయి కలిపి తీసుకొస్తున్న ఎంటర్ టైనరిది. టైటిల్ రివీల్ చేసే చిన్న టీజర్ ని ఇందాక రిలీజ్ చేశారు.

అతనో సగటు మధ్య తరగతి యువకుడు(విజయ్ దేవరకొండ). ఉదయాన్నే లేచి పాల ప్యాకెట్లు ఉల్లిపాయలు తెచ్చి, పిల్లల్ని స్కూల్ కి డ్రాప్ చేసే మాములు మనస్తత్వం. గొడవలకు దూరంగా ఉంటాడని అందరూ అనుకుంటారు. ఓ పంచాయితీ కోసం లోకల్ డాన్(అజయ్ ఘోష్) ఇతన్ని పిలిపిస్తాడు. ఒక మాములు మనిషివి, ఆడవాళ్ళ పనులు చేసే వాడివని ఎగతాళి చేస్తాడు. దానికి ధీటుగా బదులిచ్చిన ఆ కుర్రాడు ఓ ఇనుప రాడ్ ని నిలువునా వంచడమే కాదు ఓ రౌడీ తలకాయ బద్దలు కొట్టి సారీ చెప్పేస్తాడు. టెంకాయ తేవడం మర్చిపోయానని ఎగతాళిగా కౌంటర్ ఇస్తాడు.

క్లాసునే కాదు మాసుని ఆకట్టుకునేలా పరశురామ్ హీరో క్యారెక్టరైజేషన్ ని తీర్చిదిద్దిన తీరు బాగుంది. విజయ్ దేవరకొండని ఎలా వాడుకుంటే బ్యాలన్స్ అవుతుందో అతడు స్టైల్ లో డిజైన్ చేసిన సీన్ చిన్నదే అయినా బాగా పేలింది. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ని ఒక్క ఫ్రేమ్ కే పరిమితం చేశారు. తను, విజయ్ దేవరకొండ భార్య భర్తలుగా నటిస్తున్న క్లారిటీ ఇచ్చారు కాబట్టి ఇది లవ్ స్టోరీ కన్నా ఎక్కువగా కుటుంబ కథగా ఉండబోతోంది. గోపి సుందర్ నేపధ్య సంగీతం, మోహనన్ ఛాయాగ్రహణం సింపుల్ అండ్ కూల్ గా ఉన్నాయి. సంక్రాంతి బెర్తుని మరోసారి కన్ఫర్మ్ చేసిన ఫ్యామిలీ స్టార్ పెద్ద పోటీకి సిద్ధమయ్యాడు.  

Family Star Glimpse - Vijay Deverakonda, Mrunal Thakur | Parasuram | Dil Raju | Sankrathi 2024