లియో.. లియో.. లియో.. ఇప్పుడు సౌత్ ఇండియన్ సినిమా చర్చలన్నీ ఈ చిత్రం చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ తమిళ సినిమా తమిళనాడులోనే కాక మిగతా సౌత్ స్టేట్స్‌లోనూ సంచలనం రేపుతోంది. దీనికి జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ చూసి ట్రేడ్ పండిట్లు షాకవుతున్నారు. తెలుగులో దీన్నొక అనువాద చిత్రం లాగా ఎవ్వరూ చూడట్లేదు. దసరా కానుకగా రిలీజవుతున్న భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావులకు దీటుగా దీనికి బుకింగ్స్ జరుగుతున్నాయి.
పెట్టిన షోలు పెట్టినట్లు ఫుల్ అయిపోతుండటం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇలా మంచి ఊపు మీద బుకింగ్స్ నడుస్తుండగా.. నిన్న ‘లియో’ తెలుగు నిర్మాతకు ఒక షాక్ తగిలింది. ‘లియో’ టైటిల్ తన దగ్గర ఉన్న వ్యక్తి ఒకరు కోర్టుకు వెళ్లడం.. దీంతో ఈ నెల 20 వరకు రిలీజ్ ఆపేయాలని కోర్టు ఆర్డర్స్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
దీనిపై ‘లియో’ను తెలుగులో రిలీజ్ చేస్తున్న నిర్మాత నాగవంశీ మీడియా ముందుకు వచ్చాడు. ఈ సమస్య గురించి మాట్లాడాడు. చర్చలు జరుగుతున్నాయని.. సినిమా అనుకున్న ప్రకారమే గురువారం రిలీజవుతుందని ప్రకటించాడు. ఈ ప్రెస్ మీట్ జరిగిన కొన్ని గంటల్లోనే ఇష్యూ సెటిలైపోయినట్లు సమాచారం. ‘లియో’ టైటిల్ ఉన్న వ్యక్తికి రూ.25 లక్షలు ఇచ్చి గొడవను ముగించినట్లు సమాచారం.
నిజానికి టైటిల్ హక్కులున్న వ్యక్తి చాలా రోజుల ముందు నుంచే గొడవ చేస్తున్నప్పటికీ నాగవంశీ పట్టించుకోలేదట. కానీ అతను రిలీజ్ ముంగిట టైం చూసి కోర్టుకు వెళ్లడం.. అతడికి అనుకూలంగా కోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో వ్యవహారం ముదిరింది. ఇలా టైటిళ్ల విషయమై రిలీజ్‌కు ముందు రచ్చ జరగడం కొత్తేమీ కాదు. ఖలేజా, కత్తి లాంటి సినిమాలకు పేర్ల ముందు హీరో పేరు తగిలించడం గుర్తుండే ఉంటుంది. ‘లియో’కు కూడా ఆ ఛాన్స్ ఉన్నప్పటికీ.. అలా కాకుండా డబ్బులిచ్చి సెటిల్ చేసుకున్నాడట నాగవంశీ.