మనకు భీమ్లా నాయక్ వాళ్లకు లియో

గత ఏడాది భీమ్లా నాయక్ రిలీజ్ టైంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పరిణామాలు అభిమానులు అంత సులభంగా మర్చిపోలేరు. బెనిఫిట్ షోలు రద్దు చేయడం, టికెట్లు అధిక ధరలకు అమ్మకుండా కట్టడి చేసేందుకు స్వయంగా రెవిన్యూ అధికారులు థియేటర్ల దగ్గర కాపు కాయడం ఇలా చాలా జరిగాయి. కొన్ని చోట్ల ఏకంగా ఎంఆర్ఓల ఫోన్ నెంబర్లు బోర్డు రాయించి మరీ ఎగ్జిబిటర్లకు చుక్కలు చూపించిన ఉదంతాలున్నాయి. ఇదంతా పవన్ కళ్యాణ్ ని లక్ష్యంగా చేసుకున్నదేనని బాహాటంగా ఒప్పుకునే వాస్తవం. వకీల్ సాబ్ అప్పుడు కూడా ఇలాంటివి ఎన్నో జరిగాయి.

అచ్చం ఇదే తరహాలో లియో విషయంలో స్టాలిన్ సర్కార్ కఠినంగా వ్యవహరించడం పెద్ద రచ్చకు దారి తెస్తోంది. మొదటి రోజు ముందు తెల్లవారుఝాము 4 గంటల షోలకు అనుమతినిచ్చి ఆ తర్వాత వాటిని రద్దు చేస్తూ ఉదయం 9 కన్నా ముందు వేయకూడదని మరో జిఓ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీని మీద నిర్మాత ఏకంగా కోర్టుకు వెళ్లారు. ఈలోగా లియో టికెట్లు తమిళనాడులో ఎవరూ ఎక్కువ రేట్లకు అమ్మకూడదని, ఒకవేళ అలా ఎవరైనా చేసినా వెంటనే సంబంధిత ఆఫీసర్లకు తెలుపాలని వాళ్ళ నెంబర్లు ఇచ్చి మరీ ఉత్తర్వులు జారీ చేయడం అభిమానుల్లో ఆగ్రహం కలిగిస్తోంది.

ఈ ట్రీట్మెంట్ రజనీకాంత్ జైలర్ కు జరగలేదు. మనకు పవన్ మినహాయించి ఇంకే హీరోకు ఏపి సర్కారు ఆటంకాలు సృష్టించలేదు. దీంతో పవన్, విజయ్ ఫ్యాన్స్ పరస్పరం మద్దతు తెలుపుకుంటున్న వైనం సోషల్ మీడియాలో కనిపిస్తోంది. లియో మీద ముందు నుంచి రాజకీయ నీడలున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడం, ఉదయనిధికి కోరుకున్న ప్రాంతాల పంపిణి హక్కులు దక్కపోవడం వల్లే ఇలా చేస్తున్నారనే కామెంట్స్ పరిశ్రమ వర్గాల్లో ఉన్నాయి. మొత్తానికి స్టార్ హీరోల సినిమాలకు పొలిటికల్ హీట్ తగిలితే దాని తాలూకు పరిణామాలు ఈ స్థాయిలో ఉంటాయనని మళ్ళీ ఋజువయ్యింది.