హీరో మోసం చేశాడన్న స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్

డి.ఇమాన్.. త‌మిళంలో స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌డు. తెలుగులోకి ప్రేమ‌ఖైదీ, గ‌జ‌రాజు పేర్ల‌తో అనువాదం అయిన మైనా, గుంకి లాంటి చిత్రాల్లో అత‌డి పాట‌లు వింటే ఎవ్వ‌రైనా ఫిదా అయిపోవాల్సిందే. అజిత్ సినిమా విశ్వాసంకు గాను అత‌ను జాతీయ ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడిగానూ పుర‌స్కారం అందుకున్న సంగ‌తి తెలిసిందే. దీంతో అత‌డి స్థాయి ఇంకా పెరిగింది.

ఈ మ్యూజిక్ డైరెక్ట‌ర్ తాజాగా యువ క‌థానాయ‌కుడు శివ కార్తికేయ‌న్ మీద సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం కోలీవుడ్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా హీరోగా మారి మంచి రేంజికి ఎదిగిన శివ‌కు కెరీర్ ఆరంభంలో ఇమాన్ బాగానే సాయ‌ప‌డ్డాడు. శివ‌కు పెద్ద బ్రేక్ ఇచ్చిన వ‌రుత్త ప‌డాద వాలిబ‌ర్ సంఘంకు ఇమానే సంగీతం అందించాడు.

ఆ సినిమా మ్యూజిక‌ల్‌గా కూడా పెద్ద హిట్ట‌యింది. దీంతో పాటు శివ కెరీర్లో మ‌రో హిట్ మూవీ ర‌జినీ మురుగ‌న్‌కు కూడా అత‌నే సంగీత ద‌ర్శ‌కుడు. ఐతే కొన్నేళ్ల నుంచి వీళ్లిద్ద‌రూ క‌లిసి ప‌ని చేయ‌ట్లేదు. దీని గురించి ఓ ఇంట‌ర్వ్యూలో అడిగితే.. శివ‌కార్తికేయ‌న్ త‌న‌కు పెద్ద ద్రోహం చేశాడ‌ని అత‌ను వెల్ల‌డించాడు.

అత‌నేం ద్రోహం చేశాడ‌ని తాను చెప్ప‌లేన‌ని.. కానీ ఒక సినిమా విష‌యంలో మాట త‌ప్పాడు అన్న‌ట్లుగా అత‌ను మాట్లాడాడు. త‌న‌కు చేసిన ద్రోహం గురించి శివ‌ను అడిగితే.. అత‌ను చిత్ర‌మైన స‌మాధానం ఇచ్చాడ‌ని.. దాంతో త‌న గుండె ప‌గిలింద‌ని.. అత‌నేం స‌మాధానం ఇచ్చాడో తాను చెప్ప‌లేన‌ని ఇమాన్ అన్నాడు. ఐతే ఈ జ‌న్మ‌లో అయితే శివ‌కార్తికేయ‌న్‌తో తాను సినిమా చేయ‌లేన‌ని.. తాను చేయాల్సిన సినిమాకు శివ హీరో అంటే ఆ సినిమా నుంచి తాను త‌ప్పుకుంటాన‌ని.. వ‌చ్చే జ‌న్మ‌లో వీలుంటే క‌లిసి ప‌ని చేస్తామేమో చూడాల‌ని అన్నాడు ఇమాన్. ఈ వ్యాఖ్య‌ల‌పై శివ ఏమంటాడో చూడాలి.