‘లియో’ను లైట్ తీసుకోలేం..

ఈ దసరాకు తెలుగులో భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు రూపంలో రెండు క్రేజీ సినిమాలు రిలీజవుతున్నాయి. వీటిలో దేని ఆసక్తి దానిదే. ప్రేక్షకుల్లో ఈ రెండు చిత్రాల మీదా మంచి అంచనాలున్నాయి. వీటితో పాటుగా తమిళ అనువాద చిత్రం ‘లియో’ కూడా దసరా రేసులో నిలిచింది. సితార ఎంటర్టైన్మెంట్స్ లాంటి పెద్ద బేనర్ తెలుగులో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తోంది. ఈ సినిమాకు మొదట్నుంచే తెలుగులో కూడా మంచి క్రేజే ఉంది. కానీ ఈ మధ్య ట్రైలర్ వచ్చాక కొంచెం హైప్ తగ్గినట్లు కనిపించింది.

ఆ ట్రైలర్ అంచనాలకు ఏమాత్రం తగ్గట్లు లేదు. ఇటీవలే రిలీజ్ చేసిన ‘నే రెడీ’ పాట మీద కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. మరోవైపు ఇది ‘లోకేష్ సినిమాటిక్ యూనివర్శ్’లో భాగం కాదన్న ప్రచారం కొంత హైప్ తగ్గించిన సంకేతాలు కనిపించాయి. దీంతో తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను లైట్ తీసుకుంటారేమో అన్న చర్చ జరిగింది. దసరా పోటీలో ‘లియో’ నిలవగలదా అన్న ప్రశ్నలు తలెత్తాయి.

కానీ ‘లియో’ తెలుగు బుకింగ్స్ మొదలైన తీరు చూస్తుంటే ఈ సినిమాను తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదని అనిపిస్తోంది. ఈ మధ్య కనిపించిన నెగెటివిటీ అంతా లైట్ అన్నట్లే ఉంది. పెట్టిన షోలు పెట్టినట్లే అయిపోతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో. తమిళనాడు బోర్డర్లో ఉండే చిత్తూరు, నెల్లూరు లాంటి సిటీల్లో ‘భగవంత్ కేసరి’ కంటే ముందుగా తెల్లవారుజామున 4 గంటలకే ‘లియో’కు స్పెషల్ షోలు వేయబోతున్నారట.

ఈ సినిమాకు తెలుగులో నెలకొన్న క్రేజ్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక తమిళనాట అయితే ‘లియో’ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అక్కడ టికెట్ల కోసం డిమాండ్ మామూలుగా లేదు. యుఎస్, యూకే లాంటి దేశాల్లో ప్రి సేల్స్‌తోనే ‘లియో’ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అక్కడ కూడా తెలుగు వెర్షన్ కోసం మంచి డిమాండ్ కనిపిస్తోంది. చూస్తుంటే ‘లియో’ దసరాకు వచ్చే తెలుగు సినిమాల వసూళ్లపై బాగానే ప్రభావం చూపేలా ఉంది. సినిమాకు సరిపడా థియేటర్లు ఇచ్చి, టాక్ బాగుంటే మాత్రం.. దాన్నుంచి తెలుగు చిత్రాలకు ముప్పు తప్పేలా లేదు.