దేశం కోసం పంజా విసిరే ‘టైగర్ 3’

పఠాన్, జవాన్ బ్లాక్ బస్టర్ల దెబ్బకు బాలీవుడ్ కు కొత్త జోష్ వచ్చేసింది. ఒకే ఏడాది రెండు వెయ్యి కోట్ల సినిమాలు దక్కడంతో ఒక్కసారిగా ప్రాణం లేచొచ్చింది. ఇప్పుడు అందరి కళ్ళు టైగర్ 3 మీద ఉన్నాయి. యష్ రాజ్ స్పై సిరీస్ లో భాగంగా అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ ప్యాన్ ఇండియా మూవీని హిందీ తెలుగుతో పాటు అన్ని ప్రధాన భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేయబోతున్నారు. రిలీజ్ డేట్ సస్పెన్స్ కి చెక్ పెడుతూ నవంబర్ 12 ఆదివారం పులిని థియేటర్లలో దింపడానికి ముహూర్తం నిర్ణయించారు. మూడు నిమిషాల ట్రైలర్ లో కంటెంట్ ఏంటో చెప్పేశారు.

దేశం కోసం ఎంత ప్రమాదకరమైన మిషన్ అయినా సరే దాన్ని పూర్తి చేయడానికి రిస్క్ తీసుకునే గూఢచారి టైగర్(సల్మాన్ ఖాన్). భార్య (కత్రినా కైఫ్)పిల్లలతో సంతోషంగా గడుపుతునే ఎప్పుడు అవసరమైనా డ్యూటీకి సిద్ధంగా ఉంటాడు. ఇతని వల్ల దెబ్బ తిన్న పాకిస్థాన్ తీవ్రవాది(ఇమ్రాన్ హష్మీ) పన్నిన కుట్ర వల్ల టైగర్ పద్మవ్యూహంలో చిక్కుకుంటాడు. దేశద్రోహిగా ముద్రపడి స్వంత వాళ్లతోనే ఛీ కొట్టించుకునే పరిస్థితి తలెత్తుంది. అవమానం పడిన చోటే తానేంటో నిరూపించుకోవడానికి కంకణం కట్టుకున్న టైగర్ ఏకంగా పాక్ కి వెళ్లి శత్రువు ఎదురు నిలబడతాడు. అదే అసలు స్టోరీ.

కథ పరంగా కొత్తదనం లేకపోయినా కళ్లుచెదిరిపోయే రీతిలో దర్శకుడు మనీష్ శర్మ విజువల్స్ మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉన్నాయి. ఎప్పుడూ చూడలేదనే ఫీలింగ్ కలగకపోయినా భారీతనం అంతకంతా పెరిగిపోయి హాలీవుడ్ స్టాండర్డ్ ని తీసుకొచ్చారు. ప్రీతం సంగీతం ఎప్పటిలాగే టైగర్ మార్కు బ్యాక్ గ్రౌండ్ తో సాగింది. కంటెంట్ కన్నా ఎక్కువ టెక్నికల్ గ్రాండియర్ నెస్ మీద ఆధారపడ్డ టైగర్ 3 కూడా జవాన్ లాగే యాక్షన్ ఎపిసోడ్లు, ఎలివేషన్లతో మాస్ జనాలకు కనెక్ట్ అయ్యేలా ఉంది. కత్రినా కైఫ్ ఇందులోనూ ఫైట్లు చేసింది. ఇమ్రాన్ ఆష్మి విలనీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. దీపావళి కానుకగా టైగర్ 3 వస్తున్నాడు