మాస్ మహారాజ రవితేజ, దర్శక ధీర రాజమౌళి కెరీర్లో ఒక మైల్ స్టోన్ కమర్షియల్ మూవీగా నిలిచిపోయిన విక్రమార్కుడు ఎన్ని భాషల్లో రీమేక్ అయ్యిందో ఠక్కున చెప్పడం కష్టం. అంత సక్సెస్ సాధించిన బ్లాక్ బస్టరది. రెగ్యులర్ డ్యూయల్ రోల్ కథని జక్కన్న తీర్చిదిద్దిన తీరు అభిమానులకే కాదు సగటు సినీ జనాలకు సైతం పిచ్చ పిచ్చగా నచ్చేసింది. అయితే దీనికి సీక్వెల్ వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. విక్రమ్ రాథోడ్ ని చంపిన వాళ్ళ అంతు చూసేసిన అత్తిలి సత్తిబాబు హైదరాబాద్ కు తిరిగి వచ్చాక నిజంగానే పోలీసైతే ఎలా ఉంటుందనే ఆలోచనతో కథను రాసుకోవచ్చు.
వినడానికి బాగానే ఉన్నా, ఇటీవలి ఇంటర్వ్యూలలో రవితేజ ఆసక్తి చూపించినా ఇది జరిగే ఛాన్స్ మాత్రం లేదు. ఎందుకంటే అప్పటికి ఇప్పటికి రాజమౌళి స్కేల్ ప్యాన్ ఇండియాని మించి పోయింది. రేపు మహేష్ బాబు ప్రాజెక్ట్ తర్వాత ఇంకెన్ని ఎత్తులకు చేరుకుంటుందో ఊహించడం కష్టం. అలాంటప్పుడు రెగ్యులర్ స్టోరీలు తీసుకోవడం సాధ్యపడదు. ఇదే కాదు ఛత్రపతి, సింహాద్రి రేంజ్ ని దాటేసి జక్కన్న ఇప్పుడు అంతరిక్షం ఎత్తులో ఉన్నాడు. అలాంటప్పుడు ఎంచుకునే సబ్జెక్టులు కూడా దానికి తగ్గట్టే ఉండాలి. ఒకవేళ విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ సిద్ధం చేసినా ఇంకో దర్శకుడిని వెతుక్కోవాలి.
ఆ సాహసం ఎవరూ చేయకపోవచ్చు. ఎందుకంటే ఏ మాత్రం తేడా వచ్చిన లేనిపోని చెడ్డపేరు వస్తుంది కాబట్టి దానికంటే మౌనంగా ఉండటం బెటరనుకుంటారు. హిందీ రీమేక్ రౌడీ రాథోడ్ కి కొనసాగింపు చేసే ప్రయత్నాలు మాత్రం బాలీవుడ్ లో జరుగుతున్నాయి. ఫస్ట్ పార్ట్ డీల్ చేసిన దర్శకుడు ప్రభుదేవా కథను వండే పనిలో ఉన్నాడట. ఓకే అయితే అక్షయ్ కుమార్ నటించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఎటొచ్చి జింతాత జిత జిత అంటూ రవితేజనే మళ్ళీ చూసే ఛాన్స్ దక్కేలా లేదు. కొన్ని క్లాసిక్ హిట్స్ అంతే. టూ పేరుతో కంటిన్యూ చేయడం కన్నా పాత వెర్షనే చూసి ఎంజాయ్ చేసుకోవడం ఉత్తమం.