ఏడాది చివరి నెల సినిమాల రిలీజ్ పరిణామాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. ముందు డిసెంబర్ 8 విడుదల ప్లాన్ చేసుకున్న విశ్వక్ సేన్ గ్యాంగ్స్ అఫ్ గోదావరిని 24కి షిఫ్ట్ చేసే ఆలోచన సీరియస్ గా జరుగుతున్నట్టు ఆల్రెడీ టాక్ జోరుగా ఉంది. రెండు రోజుల ముందు ప్రభాస్ సలార్ పెట్టుకుని ఇలా చేయడమంటే పెద్ద రిస్క్. ఎందుకంటే యావరేజ్, ఫ్లాప్ టాక్ వస్తేనే డార్లింగ్ కనీసం వారం రోజుల పాటు బలంగా వసూళ్లు రాబడతాడు. అలాంటిది సలార్ కనక బ్లాక్ బస్టర్ తెచ్చుకుంటే దాని సునామి ముందు ఎంత మంచి కంటెంట్ అయినా సరే నిలదొక్కుకోవడం సులభంగా ఉండదు.
మరి గోదావరి టీమ్ అంత కాన్ఫిడెంట్ గా ఈ ఆప్షన్ చూస్తుందంటే సాహసమే. డుంకీ వాయిదా పడుతుందనే ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో బాలీవుడ్ మీడియా రంగంలోకి దిగి అలాంటిదేమి లేదని ఉదయం నుంచి ఊదరగొడుతోంది. ట్విస్ట్ ఏంటంటే సలార్ అనౌన్స్ మెంట్ వచ్చాక డుంకీ నుంచి ఇప్పటిదాకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సో పోస్టు పోన్ వార్తలను పూర్తిగా కొట్టిపారేయలేని పరిస్థితి నెలకొంది. అదే జరిగితే ఒక స్లాట్ ఖాళీగా ఉంటుంది కాబట్టి దాన్ని తమ సినిమాకు ఎందుకు వాడుకోకూడదనే ఆలోచన సితార ఎంటర్ టైన్మెంట్స్ నాగవంశీకి వచ్చి ఉండొచ్చు.
ప్రస్తుతానికి డిసెంబర్ 8 మీద గ్యాంగ్స్ అఫ్ గోదావరి పోస్టర్లు తిరుగుతున్నాయి. ఈ వారంలోనే నాని హాయ్ నాన్న ప్రకటన వస్తుంది. 7 దాదాపు కన్ఫర్మే. ఆపరేషన్ వాలెంటైన్ సైతం తగ్గను అంటోంది. నితిన్ ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ కూడా మంకుపట్టుతో ఉన్నది. అయితే వీటితో తలపడటం కన్నా సలార్ ని ఢీ కొట్టడం సేఫని ఎవరూ చెప్పరు. ఎంత సలార్ అయితే మాత్రం ఎవరూ రేస్ లో ఉండకూడదనే రూల్ లేదు. ఆ మాటకొస్తే తెలుగు రాష్ట్రాల్లో ప్రతిఒక్కరు ఆ ఒక్క సినిమానే చూస్తారని కాదు. అలాంటప్పుడు రెండో ఆప్షన్ ఉండటం మంచిదే. మరి గ్యాంగ్స్ అఫ్ గోదావరి నిజంగా షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకుంటుందా. చూద్దాం.