ఉద్దేశపూర్వక ఎజెండాతో రాజకీయ ‘వ్యూహం’

ఒక స్పష్టమైన ఎజెండాతో సినిమా తీసినా లేదని చెప్పడం అందరికీ సాధ్యం కాదు. రామ్ గోపాల్ వర్మ అందులో స్పెషలిస్ట్. నవంబర్ 10న వ్యూహం విడుదల కాబోతున్న సందర్భంగా ఇవాళ హైదరాబాద్ లో ట్రైలర్ లాంచ్ చేశారు. మీడియాను పిలిచి క్వశ్చన్ ఆన్సర్స్ సెషన్ కూడా పెట్టారు. తనకు ఎవరూ ఫండింగ్ ఇవ్వలేదని, కేవలం పబ్లిక్ డొమైన్ లో అందరికీ తెలిసిన కథను తెరమీద చూపించబోతున్నానని నొక్కి వక్కాణించారు.. రెండు నిమిషాల ఇరవై సెకండ్ల వీడియోలో చాలా క్లారిటీతో కేవలం ఏపి సిఎం జగన్ ని ఎలివేట్ చేయడానికి మాత్రమే వ్యూహం తీశారని అందరికీ అర్థమైపోయింది.

వైఎస్ఆర్ చనిపోయాక సోనియా గాంధీ జగన్ కి ఫోన్ చేసి బెదిరించడం, అదయ్యాక కేసులు బనాయించి అరెస్ట్ చేసి జైలుకు పంపడంతో మొదలుపెట్టి తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు, పాదయాత్రకు ప్రేరేపించిన సంఘటనలను అన్నీ పెట్టేశారు. అయితే చంద్రబాబునాయుడునే లక్ష్యంగా పెట్టుకున్న వైనం, పవన్ కళ్యాణ్ ని ఎద్దేవా చేయడానికి ఉద్దేశించిన సంఘటనలతో పాటు ఇప్పుడు ఏపిని కుదిపేస్తున్న స్కిల్ డెవలప్మెంట్ కేసు గురించి కూడా పొందుపరచడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంటే స్క్రిప్ట్ కు సంబంధించిన ఇన్ ఫుట్స్ పార్టీ వర్గాలు ఇచ్చాయేమోననే అనుమానం కలుగుతుంది.

బయటికి చెప్పినా చెప్పకపోయినా వ్యూహం కేవలం జగన్ ని హీరోగా చూపించడానికి వర్మ చేసిన ప్రయత్నం తప్ప ఇంకేమి కాదు. సోషల్ మీడియాలో తన కామెంట్లు దినచర్య చూసిన ప్రతి ఒక్కరికి ఇది తెలిసిన విషయమే అయినా ఇంటర్ నెట్ ప్రపంచానికి దూరంగా ఉండే సగటు జనాలకు కూడా వ్యూహం చూశాక ఇది అర్థమైపోతుంది, మేకింగ్, ప్రొడక్షన్ వేల్యూస్ ఎప్పటిలాగే వర్మ స్థాయికి తగ్గట్టు లో క్వాలిటీలో ఉన్నాయి. క్యాస్టింగ్ మాత్రం అచ్చంగా అతికినట్టు తీసుకునే వర్మ స్టైల్ ఇందులోనూ కొనసాగింది. ఇక్కడితో అయిపోలేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో దీని కొనసాగింపు శపథం కూడా వస్తుంది