చరణ్ ప్రచారం ఆపేయండి స్వామీ

దసరాకు విడుదల కాబోతున్న లియోలో రామ్ చరణ్ క్యామియో ఉంటుందనే ప్రచారం పీక్స్ కి చేరుకొని సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఇంత జరుగుతున్నా నిర్మాణ సంస్థ దాన్ని ఖండించకుండా మౌనంగా ఉండటంతో మెగా ఫ్యాన్స్ దీన్ని నిజమే అనుకుని వార్తను మరింత వైరల్ చేయడంలో బిజీగా ఉన్నారు. నిజానికి ట్రైలర్ వచ్చాక ఏర్పడిన నెగటివిటీ ఈ హంగామా వల్ల తగ్గిపోయిన మాట వాస్తవం. నిజంగా ఉన్నాడేమో అనే రేంజ్ లో ఎలివేషన్లు ఇస్తున్నారు. ఒక ఫ్యాన్ ఏకంగా లోకేష్ కనగరాజ్ పేరుతో బ్లూ టిక్ ట్విట్టర్ హ్యాండిల్ కొనుక్కుని దాంట్లో రామ్ చరణ్ కు థాంక్స్ చెప్పడం చాలా దూరం వెళ్ళింది.

చెన్నై మీడియా వర్గాలు అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తున్నా లియో ప్రొడక్షన్ టీమ్ మాత్రం సైలెంట్ గా ఈ హైప్ ని ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ ప్రభావం అక్టోబర్ 19 ఓపెనింగ్ రోజు బెనిఫిట్ షో మీద బలంగా ఉండబోతోంది. ఒకవేళ నిజంగా చరణ్ ఉంటే ఫస్ట్ డే ఫస్ట్ షో మిస్ అయిన లోటు ఉండిపోతుందేమోనని టికెట్లు బుక్ చేసుకోవడం కోసం ఎదురు చూస్తున్న మెగాభిమానులు లక్షల్లో ఉన్నారు. పలు ఇంటర్వ్యూలలో లోకేష్ ఒకరి క్యామియో ఉంటుందని చెప్పాడు కానీ ఫలానా రేంజ్ అని కాని విక్రమ్ లో రోలెక్స్ స్థాయిలో అని కానీ ఎలాంటి క్లూలు, సమాచారం ఇవ్వలేదు.

అయినా సరే ఇంత రాద్ధాంతం జరగడం హైప్ పరంగా లియోకు మేలే చేస్తోంది. భగవంత్ కేసరి ట్రైలర్ వచ్చాక టాలీవుడ్ ఆడియన్స్ ఆసక్తి ఒక్కసారిగా దానివైపుకి మళ్లింది. బాలయ్య ఖచ్చితంగా కొడతాడని నమ్మకం ఫ్యాన్స్ లోనే కాదు బయ్యర్లలోనూ వినిపిస్తోంది. పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్న మాట వాస్తవం. ఇంకోవైపు టైగర్ నాగేశ్వరరావు ఫీవర్ ఇంకా దాని స్థాయిలో పెరగలేదు కానీ రవితేజ టీమ్ హైదరాబాద్ వచ్చాక ఇక్కడ పబ్లిసిటీ వేగం పెంచబోతున్నారు. ఇంకోవైపు ఏ మాత్రం నిర్ధారణ లేని వార్తతో ఒక సినిమా హైప్ ని ఇంతలా పెంచడం ఈ మధ్య కాలంలో ఒక్క లియోకే జరిగింది.