99 రూపాయల సినిమా సూపర్ హిట్టు

సగటు మధ్య తరగతి జనాలకు థియేటర్ సినిమా మరీ అందని ద్రాక్షగా మారిపోతోంది. ఏదో పెద్ద హీరో బొమ్మ లేదా విజువల్ గ్రాండియర్ అయితే తప్ప అదే పనిగా కుటుంబాలను తీసుకుని హాలుకు వెళ్లే పరిస్థితి లేదు. అక్టోబర్ 13 జాతీయ చలనచిత్ర దినోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఉన్న మల్టీప్లెక్సులు రోజు మొత్తం ఏ షో అయినా సరే కొత్త పాత తేడా లేకుండా ప్రతి సినిమాకు టికెట్ ధర కేవలం 99 రూపాయలు పెట్టడం అద్భుత ఫలితాలను ఇస్తోంది. ఎప్పుడో నెల క్రితం వచ్చిన జవాన్ అడ్వాన్స్ బుకింగ్ లోనే 3 లక్షల పై చిలుకు టికెట్లు అమ్మడం షాక్ కలిగించే విషయం.

తెలుగులో మ్యాడ్ లాంటి చిన్న బడ్జెట్ హిట్ సినిమాలు ఈ స్కీం వల్ల బ్రహ్మాండంగా హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. ఇవాళ అన్ని భాషలు కలిపి సుమారు పదిహేను పైగా కొత్త రిలీజులున్నాయి. స్టార్ హీరోలు లేనివి కాబట్టి తక్కువ ధర అనే ఉద్దేశంతో వస్తున్న ఆడియన్స్ ఎక్కువగానే ఉన్నారు. ఇది ప్రతి సంవత్సరం చేస్తున్నప్పటికీ ఏడాది గడిచే కొద్దీ ఆక్యుపెన్సీలు భారీగా నమోదవుతున్నాయి. రెండు వందల నుంచి వెయ్యి రూపాయల దాకా నగరాల్లో మల్టీప్లెక్స్ రేట్లు జేబులకు చిల్లులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఇంత భారీ డిస్కౌంట్ అంటే జనం ఎగబడకుండా ఉంటారా.

ఇకనైనా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రభుత్వాలు ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలి. మొదటి వారం పది రోజులు మినహాయించి మహేష్ బాబు లాంటి పెద్ద హీరోకు, సంపూర్ణేష్ బాబు లాంటి చిన్న హీరోకు ఒకటే రేట్ పెట్టడం పబ్లిక్ ని ప్రభావితం చేస్తోంది. చిన్న సినిమాలు చితికిపోతోంది కేవలం ఈ కారణంగానే. వీకెండ్ కాకుండా కనీసం మాములు రోజుల్లో అయినా తగ్గించేలా చర్యలు తీసుకుంటే బాగుండేది. విచిత్రం ఏమిటంటే తెలంగాణలో ఈ తగ్గింపు 112 రూపాయలకు పరిమితం కాగా ఆంధ్రప్రదేశ్ లో నిబంధనల కారణంగా ఏ డిస్కౌంట్లు లేక అక్కడ మాత్రం రెగ్యులర్ రేట్లే ఉన్నాయి.