లాక్‍డౌన్‍ బ్రతుకే లాభం బ్రదరూ!

Solo Brathuke So Better

లాక్‍డౌన్‍లో తెలుగు సినిమా నిర్మాతలకు కొత్త ప్రత్యామ్నాయం దొరికింది. థియేటర్లలో విడుదల చేసే బయ్యర్ల కోసం ఎదురు చూడాల్సిన పని లేకుండా ఏకమొత్తంగా ఒకేసారి రైట్స్ తీసేసుకుంటున్నాయి ఓటీటీ సంస్థలు. విశేషం ఏమిటంటే… ఓటీటీలు కేవలం ఇప్పటి పరిస్థితులను క్యాష్‍ చేసుకోవాలని చూడడం కాకుండా ఫ్యూచర్‍లో కూడా కొత్త సినిమాల హక్కులు తమ చేతిలో వుండేట్టు ప్లాన్‍ చేసుకుంటున్నాయి.

‘వి’ చిత్ర హక్కులను అమెజాన్‍ ప్రైమ్‍ ముప్పయ్‍ కోట్లకు పైగా చెల్లించి సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సాయి ధరమ్‍ తేజ్‍ నటించిన ‘సోలో బ్రతుకే సో బెటరు’ చిత్ర హక్కులను కూడా అంతే మొత్తం చెల్లించి జీ5 తీసుకుందట. అయితే ‘సోలో బ్రతుకే’ షూటింగ్‍ ఇంకా పూర్తి కాలేదు. ఈ చిత్రం సిద్ధం కావాలంటే మళ్లీ షూటింగులు మొదలు కావాల్సిందే.

మరి జీ5 ఎందుకని ఈ చిత్ర హక్కులను అంత మొత్తం చెల్లించి తీసుకున్నట్టు? థియేటర్స్లో రిలీజ్‍ చేసుకునే వీలుంటే అది కూడా వాళ్లే చేసుకుంటారట. ఇక ఓటిటిలో ఎప్పుడంటే అప్పుడు విడుదల చేసుకునే హక్కు వాళ్లకు ఎలాగో వుంటుంది. ఈ చిత్రానికి పెట్టిన పెట్టుబడి కంటే కొన్ని కోట్ల లాభం ఈ డీల్‍తోనే రావడంతో నిర్మాత హ్యాపీ. ఇక మీదట కూడా కేవలం రెగ్యులర్‍ డిస్ట్రిబ్యూటర్లతో కాకుండా ఓటిటిలతోనూ రిలీజ్‍ డీల్స్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది.