ఈ ఏడాది ఆన్ లైన్లో, ఆఫ్ లైన్లో విపరీతమైన చర్చకు దారి తీసిన సినిమాల్లో ఆదిపురుష్ ఒకటి. ప్రభాస్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రూపొందించిన ఈ చిత్రం రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఐతే ఆధునిక సొబగులు అద్దే క్రమంలో రామాయణాన్ని చెడగొట్టారంటూ ఈ సినిమాపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రధాన పాత్రలను ఇందులో చూపించిన తీరు.. కొన్ని సన్నివేశాలు, డైలాగులపై తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి.
రిలీజ్ టైంలోనే కాక.. ఆ తర్వాత కూడా వివాదాలు కొనసాగాయి. హిందువుల మనోభావాలను కించపరిచారంటూ ఈ సినిమా మీద కోర్టుల్లో పలు కేసులు నమోదయ్యాయి. ఇది ఆ చిత్ర బృందానికి పెద్ద తలనొప్పిగామారింది. సినిమా రిలీజై నెలలు గడుస్తున్నా ఆ కేసులు కొనసాగుతుండటంతో ఏమవుతుందో అన్న ఆందోళన టీం సభ్యుల్లో నెలకొంది.
ఐతే ఎట్టకేలకు ఆదిపురుష్ టీంకు ఉపశమనం లభించింది.
ఆదిపురుష్ సినిమాకు సంబంధించి వివిధ కోర్టుల్లో నమోదైన అన్ని కేసులనూ సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చిందని.. ఆ తర్వాతే సినిమా విడుదలై దాని థియేట్రికల్ రన్ కూడా ముగిసిందని.. ఇక దాని మీద చర్చ అనవసరమని సుప్రీం కోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.
అన్ని కోర్టుల్లోనూ సంబంధిత పిటిషన్ల మీద విచారణ ఆపేయాలని కోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్ల మీద వాదోపవాదాలు వ్యర్థమని స్పష్టం చేసింది. దీంతో ఆదిపురుష్ టీంకు పెద్ద తలనొప్పి తీరిపోయినట్లే. ఈ సినిమాలో రావణుడు పాత్రను మలిచిన విధానం.. హనుమంతుడి పాత్రకు పెట్టిన డైలాగులు సహా పలు అంశాలు వివాదాలకు దారి తీశాయి. వీటి మీదే పలువురు కోర్టు మెట్లెక్కారు.