గాయం 2 కథనే లియోగా మార్చుకున్నారా

జగపతిబాబు దర్శకుడు రాంగోపాల్ వర్మ కాంబోలో వచ్చిన కల్ట్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా గాయం సినిమాది చాలా ప్రత్యేక స్థానం. 1993లో రిలీజై సంచలన విజయం నమోదు చేసి ఇద్దరికీ పెద్ద బ్రేక్ ఇచ్చింది. మణిరత్నం స్క్రీన్ ప్లే సమకూర్చడం అప్పట్లో సంచలనం. దీనికి కొనసాగింపుగా పదిహేడు సంవత్సరాల తర్వాత 2010లో గాయం 2 వచ్చింది. అయితే దీనికి వర్మ డైరెక్షన్ చేయలేదు. కేవలం సమర్పకుడిగా వ్యవహరించి ఆ బాధ్యతను ప్రవీణ్ శ్రీకి అప్పగించారు. ఇళయరాజా సంగీతంతో భారీ అంచనాల మధ్య విడుదలైన గాయం 2 ఆశించిన స్థాయిలో విజయం దక్కించుకోలేదు.

దీనికి లియోకి కనెక్షన్ ఏంటనే విషయానికి వద్దాం. గాయం 2ని హాలీవుడ్ మూవీ ఏ హిస్టరీ అఫ్ వయొలెన్స్ ఆధారంగా రాసుకున్నారు. రీమేక్ కాదు కానీ స్ఫూర్తి చెందిన విషయం స్పష్టంగా కనిపిస్తుంది. భయంకరమైన నేర సామ్రాజ్యపు ఫ్లాష్ బ్యాక్ ఉన్న హీరో దాన్ని వదిలేసి వేరే దేశంలో రెస్టారెంట్ పెట్టుకుని గొడవలకు దూరంగా బ్రతుకుతూ ఉంటాడు. అయితే ఏళ్ళ తరబడి అతన్ని వెతుకుతున్న శత్రువులకు జాడ తెలిశాక ఫ్యామిలీని లక్ష్యంగా పెట్టుకుంటారు. దీంతో తనలో అసలు గ్యాంగ్ స్టర్ ని బయటికి తీసి వాళ్ళ ఊచకోతకి రెడీ అవుతాడు. పూర్వాశ్రమానికి వస్తాడు. ఇది అందులో ప్రధాన కథ.

కట్ చేస్తే ఇప్పుడు లియోకి దీనికి దగ్గరి పోలికలు చాలా కనిపిస్తాయి. విజయ్ ఎక్కడో హిల్ స్టేషన్ లో హోటల్ పెట్టుకోవడం, భయపడుతూ జీవనం సాగించడం, ప్రత్యర్థులు వచ్చి దాడి చేస్తే తప్పించుకోవడం, చివరికి తిరగబడటం మొత్తం ట్రైలర్ ని డీకోడ్ చేస్తే ఇవే అంశాలు కనిపిస్తాయి. గత రెండు మూడు నెలలుగా లియో కూడా ఏ హిస్టరీ అఫ్ వయొలెన్స్ రీమేకనే ప్రచారం చెన్నై వర్గాల్లో బలంగా తిరుగుతోంది. ఇవన్నీ విశ్లేషించుకుని చూస్తే నిజమనిపించేలా ఉన్నాయి. వీటి సంగతి ఎలా ఉన్నా లియో ఫీవర్ మాత్రం అభిమానుల్లో బలంగా ఉంది. అంచనాలు అందుకోవడమే బ్యాలన్స్.