విల‌క్ష‌ణ న‌టుడి మ‌రో ప్ర‌యోగం

గ‌త ద‌శాబ్దంలో ద‌క్షిణాది సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎన్నో ప్ర‌యోగాలు చేసి, న‌టుడిగా ఎన్నో విల‌క్ష‌ణ పాత్ర‌లు చేసి ల‌క్ష‌లాది మంది అభిమానులను సంపాదించుకున్న న‌టుడు ఫాహ‌ద్ ఫాజిల్. లెజెండ‌రీ మ‌ల‌యాళ ద‌ర్శ‌కుడు ఫాజిల్ త‌న‌యుడైన ఫాహ‌ద్ మొద‌ట్లో మామూలు సినిమాలే చేశాడు. కానీ గ‌త ఐదారేళ్ల‌లో మాత్రం అత‌డి నుంచి అద్భుత‌మైన సినిమాలు వ‌చ్చాయి. డిజిట‌ల్ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్స్ వ‌చ్చి మ‌ల‌యాళ సినిమాల ప‌రిధి పెరిగాక ఇత‌ర భాష‌ల వాళ్ల‌కూ ఫాహ‌ద్ స‌త్తా ఏంటో తెలిసింది. ఈ మ‌ధ్యే వ‌చ్చిన ట్రాన్స్ సినిమా చూసి మెస్మ‌రైజ్ అయిపోయారు వివిధ భాష‌ల వాళ్లు. కుంబ‌లంగి నైట్స్‌లో సైతం అద్భుత‌మైన పెర్ఫామెన్స్‌ను వారెవా అనిపించాడు ఫాహ‌ద్.

ఫాహ‌ద్ సినిమా అంటే అందులో ఏదో ప్ర‌త్యేక‌త ఉంటుంద‌ని.. ఫాహ‌ద్ పాత్ర‌లో ఏదో విశేషం ఉంటుంద‌ని న‌మ్ముతున్నారు ప్రేక్ష‌కులు. ఇప్పుడ‌త‌ను మ‌రో ప్ర‌యోగాత్మ‌క సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ఆ సినిమానే.. సీ యూ సూన్. ఇది మొత్తం ఐఫోన్లో చిత్రీక‌రించిన సినిమా కావ‌డం విశేషం. ఎడిట‌ర్ ట‌ర్న్డ్ మ‌హేష్ నారాయ‌ణ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఓ అబ్బాయి.. అమ్మాయి.. ఇద్ద‌రూ త‌ర‌చుగా వీడియో కాల్స్‌లో మాట్లాడుతుంటారు. అత‌ను ఆఫీస్‌లో ఉండ‌గా.. ఆ అమ్మాయి ఇంట్లో గొడ‌వ జ‌రుగుతుంది. త‌ర్వాత ఆమె ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డుతుంది. దీంతో ఆ కుర్రాడు కేసులో ఇరుక్కుంటాడు. అత‌ణ్ని ర‌క్షించ‌డానికి స్నేహితులు ఏం చేశార‌న్న‌దే ఈ క‌థ‌. లాక్ డౌన్ టైంలో ఐఫోన్ ద్వారా ఈ సినిమాను చిత్రీక‌రించ‌డం విశేషం. కాన్సెప్ట్, విజువ‌ల్స్ అంతా కొత్త‌గా క‌నిపిస్తున్నాయి. సెప్టెంబ‌రు 1న అమేజాన్ ప్రైంలో ఈ సినిమా నేరుగా విడుద‌ల కానుంది.