గత నెల విడుదలై బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా అవతరించిన జవాన్ ఓటిటి ప్రీమియర్ కు రంగం సిద్ధమయ్యింది. డిజిటల్ వర్గాల కథనం మేరకు నవంబర్ 2న నెట్ ఫ్లిక్స్ లో రాబోతున్నట్టు తెలిసింది. ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ తేదీని మాత్రం లాక్ చేసుకున్నారట. ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే ఒప్పందంలోని నిబంధన మేరకు కొంత ఆలస్యంగా వస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల్లోని జాతీయ మల్టీప్లెక్సులు పెద్ద హీరోల సినిమాలకు థియేటర్ ఓటిటి మధ్య రెండు నెలల నిడివి లేకపోతే స్క్రీనింగ్స్ కి సహకరించమని చెబుతున్నారు. అందుకే బడా స్టార్లు జాగ్రత్త పడుతున్నారు.
ఆల్రెడీ వెయ్యి కోట్లు దాటేసిన జవాన్ బాక్సాఫీస్ వద్ద ఇంకా స్టడీగానే ఉంది. గత రెండు వారాల్లో అన్ని భాషల్లో చెప్పుకోదగ్గ రిలీజ్ అయితే ఏదీ రాలేదు. వచ్చినవన్నీ అంతంత మాత్రంగా ఉండటంతో మాస్ ఆడియన్స్ తిరిగి జవాన్ వైపే మొగ్గు చూపారు. తెలుగు రాష్ట్రాల్లోనూ తిరిగి కొంత పికప్ కనిపిస్తోంది. మ్యాడ్ తర్వాత ఉన్నంతలో ఇదే బెస్ట్ ఆప్షన్ గా మారిపోయింది. సిద్దార్థ్ చిన్నా కొంత పర్వాలేదనిపిస్తున్నా కలెక్షన్లు ఆ స్థాయిలో కనిపించడం లేదు. సో పలు సెంటర్లలో జవాన్ ని మళ్ళీ తీసుకొచ్చి రీ ప్లేస్ చేసిన స్క్రీన్లు చెప్పుకోదగ్గ కౌంట్ లోనే ఉన్నాయని డిస్ట్రిబ్యూటర్ల నుంచి వినిపిస్తున్న మాట.
అన్ని భాషల్లోనూ ఒకేసారి స్ట్రీమింగ్ చేస్తారు. నెట్ ఫ్లిక్స్ దీని మీద భారీ పెట్టుబడి పెట్టింది. రెండు వందల కోట్లు చెల్లించారనే టాక్ ఉంది కానీ సినిమా వర్గాలు దాన్ని అధికారికంగా ధృవీకరించలేదు. షారుఖ్ ఖాన్ కు ఈ ఏడాది బలమైన కంబ్యాక్ ఇచ్చిన పఠాన్, జవాన్ రెండూ ఒకదాన్ని మించి మరొకటి ఇండస్ట్రీ రికార్డులు సాధించడం ఫ్యాన్స్ కి మాములు ఆనందాన్ని ఇవ్వలేదు. డిసెంబర్లో రాబోయే డుంకీతో హ్యాట్రిక్ కొడతామనే ధీమాలో ఉన్నారు. అదే కనక జరిగితే ఒకే సంవత్సరంలో మూడు వెయ్యి కోట్ల గ్రాసర్స్ ఇచ్చిన ఏకైన ఇండియన్ హీరోగా షారుఖ్ ఖాన్ కొత్త చరిత్ర సృష్టిస్తాడు. చూడాలి మరి.