భోళా శంకర్.. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఒక పెద్ద మరకలా మిగిలిపోయిన చిత్రం. చిరు కెరీర్లో డిజాస్టర్లు లేవని కాదు కానీ.. మరీ ఈ స్థాయిలో ప్రేక్షకుల ఛీత్కారానికి గురైన సినిమా మరొకటి లేదు అంటే అతిశయోక్తి కాదేమో. రిలీజ్‌కు ముందే ఈ చిత్రం ప్రేక్షకుల తిరస్కారానికి గురైందని చెప్పొచ్చు. విడుదల తర్వాత నెగెటివిటీ గురించి చెప్పాల్సిన పనే లేదు.
సినిమా చూడకుండానే బాలేదన్నారంటూ టీం సభ్యులు కొంత ఆవేదన వ్యక్తం చేసినా.. థియేటర్లకు వెళ్లి సినిమా చూడకుండా కామెంట్ చేసిన వాళ్లు కూడా తర్వాత ఓటీటీలో ఈ చిత్రాన్ని చూసి తీవ్రంగా విమర్శించారు. తమిళంలో బ్లాక్‌బస్టర్ అయిన సినిమా తెలుగులో మరీ ఇంత దారుణమైన ఫలితం అందుకోవడం ఆశ్చర్యకరం. కొత్త, పాత సినిమాల గురించి తన యూట్యూబ్ ఛానెల్లో ఆసక్తికర విశ్లేషణలు చేసే లెజెండరీ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ.. ‘భోళా శంకర్’ విషయంలో జరిగిన తప్పుల గురించి మాట్లాడారు.
కోల్‌కతా నేపథ్యంలో ఈ సినిమా కథను నడిపించడం ప్రాథమిక లోపం అని పరుచూరి అన్నారు. కథ అలా మొదలు కాగానే ఇది మన కథ కాదు అనే ఫీలింగ్ తనకు కలిగిందన్నారాయన. మాతృకలో ఎలా ఉన్నప్పటికీ మన నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేయాల్సిందని.. చిత్ర బృందం అలాంటి కసరత్తు చేసినట్లు అనిపించలేదని పరుచూరి పేర్కొన్నారు. ఓవైపు హ్యూమన్ ట్రాఫికింగ్ మీద హీరో పోరాటం.. మరోపక్క అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ మీద కథను నడిపించారని.. అది రెండు పడవల ప్రయాణంలా కనిపించిందని ఆయనన్నారు.
చిరంజీవి లాంటి అగ్ర హీరోతో నేరుగా హత్యలు చేయించడం చూసి తాను ఉలిక్కిపడ్డానని.. ఇలాంటి పెద్ద హీరోలతో సినిమాలు చేసేటపుడు ముందు ప్రతీకారానికి కారణం చూపించి ఆ తర్వాత హత్యలు చేయించాల్సిందని ఆయనన్నారు. హీరో మీద హీరోయిన్ అంత కోపం పెంచుకోవడం ప్రేక్షకులకు నచ్చదని ఆయనన్నారు. అలాగే చిరంజీవి లాంటి ఇమేజ్ ఉన్న హీరో ఒక అమ్మాయిని తీవ్రంగా ఇబ్బంది పెడుతూ తనను మోసం చేసి ఇల్లు ఖాళీ చేయించడం లాంటి సీన్లు కూడా ప్రేక్షకులకు రుచించవని.. చిరు ఇమేజ్‌కు తగ్గ పాత్ర, కథ ఇవి కావని పరుచూరి అభిప్రాయపడ్డారు. చిరుకు ఒక హీరోయిన్ని పెట్టి తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకున్నట్లు చూపిస్తే ఈ సినిమా మెరుగ్గా ఉండేదని ఆయనన్నారు.