మ్యాడ్ మోత మోగించ‌బోతోందా?

ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మ్యాడ్ ర‌ష్ చూస్తున్నాం.  ఒకేసారి అర‌డ‌జ‌ను చెప్పుకోద‌గ్గ సినిమాలు రిలీజయ్యాయి శుక్ర‌వారం. ఏదో నామ‌మాత్రంగా రిలీజ‌వుతున్న సినిమాల‌ను కూడా క‌లుపుకుంటే నంబ‌ర్ ప‌ది దాకా ఉంది. ఐతే కొత్త రిలీజ్‌ల్లో చాలా చిత్రాలు మినిమం ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేసేలా లేవు. ఒక్క మ్యాడ్ సినిమాకు మాత్ర‌మే ఫుల్ పాజిటివ్ టాక్ వ‌చ్చింది.

త‌మిళ అనువాద చిత్రం చిన్నాకు మంచి టాక్ ఉన్నా లిమిటెడ్ రిలీజ్‌తో వ‌చ్చిన ఆ చిత్రం ప్రేక్ష‌కుల దృష్టిలో ఏమాత్రం ప‌డుతుంద‌న్న‌ది సందేహంగానే ఉంది. మిగ‌తా సినిమాలు నెగెటివ్, డివైడ్ టాక్ తెచ్చుకున్నాయి. ఒకేసారి ఎక్కువ సినిమాలు రిలీజైన‌పుడు నెగెటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాలు ఎలా అడ్ర‌స్ లేకుండా పోతాయో.. అన్నింట్లోకి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాకు అంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు మ్యాడ్‌కు కూడా అలాగే క‌లిసొచ్చేలా ఉంది.

ముందు రోజు రాత్రి ప్రిమియ‌ర్ల నుంచే మ్యాడ్‌కు హిట్ టాక్ వ‌చ్చింది. తొలి రోజు షో షోకి పాజిటివ్ టాక్ పెరుగుతూ వెళ్తోంది. సాయంత్రానికి సినిమాకు చాలా చోట్ల హౌస్ ఫుల్స్ ప‌డిపోయాయి. యూత్ సినిమాను ఎగ‌బ‌డి చూస్తున్న సంకేతాలు క‌నిపిస్తున్నాయి. మ్యాడ్ మ‌రీ గొప్ప సినిమా కాక‌పోయినా ఉన్న వాటిలో బెస్ట్, టైంపాస్ వినోదానికి ఢోకా లేక‌పోవ‌డంతో యూత్‌కు ఇదే ఫ‌స్ట్ ఛాయిస్ అవుతోంది.

సినిమాకు క్ర‌మంగా స్క్రీన్లు కూడా పెరిగే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. శుక్ర‌వారం సాయంత్రం బుక్ మై షోలో మ్యాడ్‌కు ఫుల్ పాజిటివ్ ట్రెండ్స్ క‌నిపిస్తున్నాయి. చూస్తుంటే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఈ సినిమా ఫుల్ అడ్వాంటేజ్ తీసుకునేలా ఉంది. ఫుల్ ర‌న్లో ఈజీగా ప‌ది కోట్ల షేర్ మార్కును సినిమా క్రాస్ చేసేలా ఉంది. ఇంకా పెద్ద నంబ‌ర్స్ న‌మోదైనా ఆశ్చ‌ర్యం లేదేమో. కొత్త ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ శంక‌ర్ రూపొందించిన ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్టైన్మెంట్స్ నిర్మించింది.