‘1 నేనొక్కడినే’పై భలే చెప్పాడు

మహేష్ బాబు తన కెరీర్లో చాలా స్పెషల్‌గా భావించిన సినిమాల్లో ‘1 నేనొక్కడినే’ ఒకటి. సుకుమార్ దర్శకత్వంలో మహేష్ అనగానే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదల ముంగిట దీనికి మామూలు హైప్ రాలేదు. కానీ ఆ అంచనాలకు భిన్నంగా సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్ద డిజాస్టర్ అయింది. మహేష్ కెరీర్లో అతి తక్కువ ఓపెనింగ్స్ వచ్చిన చిత్రాల్లో ఇదొకటి. ఓవరాల్ వసూళ్లలో కూడా బాగా నిరాశకు గురి చేసింది.

కానీ ఈ సినిమా తర్వాతి కాలంలో ఒక కల్ట్‌ మూవీగా పేరు తెచ్చుకుంది. టీవీల్లో, ఓటీటీలో సినిమాలు చూసిన వాళ్లు గొప్పగా సినిమాగా పేర్కొన్నారు. ఇలాంటి సినిమాకు అలాంటి ఫలితం రావడం ఏంటి అని ఆశ్చర్యపోయారు. 1 నేనొక్కడినే ఫెయిల్యూర్ మీద చాలామంది చాలా రకాల విశ్లేషణలు చేశారు. తాజాగా రైటర్, యాక్టర్, డైరెక్టర్ హర్షవర్ధన్ ఈ సినిమా అసలు సమస్య ఏంటో ఆసక్తికర రీతిలో చెప్పారు.

తన కొత్త చిత్రం ‘మామా మశ్చీంద్ర’ రిలీజ్ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో ‘1 నేనొక్కడినే’ ఫెయిల్యూర్ గురించి విశ్లేషించాడు హర్ష. ‘‘నాకు చాలా ఇష్టమైన సినిమా అది. మామూలు ఎగ్జిక్యూషన్ కాదు అది. 1 నేనొక్కడినే మిస్ ఫైర్ కావడానికి అందరూ అనుకున్నట్లు ఆ స్క్రీన్ ప్లేలో ఉన్న కాంప్లికేషన్ ఒక్కటే కారణం కాదు. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే.. ప్రేక్షకులకు పరిచయం లేని కాన్సెప్ట్ అది. ఎప్పుడైనా సరే రెండు మూడు కొత్త విషయాలు చెప్పినపుడు దొరికేస్తాం. ‘1 నేనొక్కడినే’ స్లోగా అర్థమయ్యే సినిమా.

ఇంకోసారి చూస్తే బాగా అర్థమవుతుంది. ఇలాంటి సినిమాకు ముందు ఆడియన్స్‌ను ప్రిపేర్ చేయకపోవడం పెద్ద మైనస్ అయిందని నా అభిప్రాయం. హీరో ఇలా ఉంటాడు. కొడితే రెండు మూడు సుమోలు గాల్లో లేచిపోయే టైపు మాస్ మసాలా సినిమా కాదు.. దీని పద్ధతి వేరు.. బ్రెయిన్ గేమ్ ఉంటుంది.. ఇలా ప్రేక్షకులను ప్రిపేర్ చేసి ఉండాల్సింది. ఐతే సుకుమార్ గారి అంతకుముందు సినిమాల్లో కూడా బ్రెయిన్ గేమ్స్ ఉంటాయి. దీన్ని కూడా అలాగే ఆదరిస్తారని అనుకుని ఉండొచ్చు. కానీ వాటిలో ఉన్న కాంప్లికేషన్ వేరు. ఇది వేరు’’ అని హర్ష చెప్పాడు.