ఆ రెండు సినిమాలు.. ఏం చేయలేకపోయా

టాలీవుడ్ యువ కథానాయకుల్లో కిరణ్ అబ్బవరంది ఆసక్తికర ప్రయాణం. అతను ‘రాజా వారు రాణివారు’ అనే చిన్న సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. థియేటర్లలో ఉండగా ఆ సినిమాను జనం పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఓటీటీలో అది మంచి స్పందన తెచ్చుకుంది. ఈ సినిమాతో వచ్చిన గుర్తింపుతో ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’లో అవకాశం దక్కించుకున్నాడు. ఆ సినిమాలో కంటెంట్ వీకే అయినా.. ప్రోమోలు ఆకట్టుకోవడం, పాటలు పెద్ద హిట్టవడంతో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. నెగెటివ్ టాక్‌తోనూ ఆ చిత్రం మంచి వసూళ్లు రాబట్టి హిట్ స్టేటస్ తెచ్చుకుంది.

దీంతో కిరణ్‌కు అవకాశాలు వరుస కట్టాయి. కానీ ముందు వెనుక చూసుకోకుండా సినిమాలు ఒప్పేసుకుని.. చకచకా లాగించేయడం కిరణ్‌కు చేటు చేసింది. సమ్మతమే, వినరో భాగ్యము విష్ణు కథ ఓ మోస్తరుగా ఆడినా.. సెబాస్టియన్, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, మీటర్ సినిమాలు దారుణమైన ఫలితాలందుకున్నాయి. ఎంత వేగంగా రైజ్ అయ్యాడో అంతే వేగంగా కింద పడ్డాడు కిరణ్. ‘మీటర్’ సినిమా టైంలో అతడి మీద విపరీతమైన నెగెటివిటీ కనిపించింది. ప్రేక్షకులను కిరణ్ గ్రాంటెడ్‌గా తీసుకుంటున్నాడనే విమర్శలు వచ్చాయి.

మరీ ఇంత నాసిరకం సినిమాలు చేయడమేంటి అనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ నెగెటివిటీ కిరణ్ మీద కొంచెం గట్టిగానే ప్రభావం చూపినట్లుంది. తన కొత్త చిత్రం ‘రూల్స్ రంజన్’ రిలీజ్ సందర్భంగా అతను అణకువతోో కనిపిస్తున్నాడు. తనలో పశ్చాత్తాప భావం కనిపిస్తోంది. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో కూడా ఇకపై తప్పులు జరగవన్నట్లు మాట్లాడాడు. తాజాగా మీడియా ఇంటర్వ్యూల సందర్భంగా తన గత సినిమాల్లో జరిగిన తప్పుల గురించి అతను మాట్లాడాడు.

నేను మీకు బాగా కావాల్సిన వాాడిని, మీటర్ సినిమాల గురించి పరోక్షంగా మాట్లాడుతూ.. వాటి విషయంలో తాను తప్పు చేసినట్లు చెప్పకనే చెప్పాడు. కానీ తప్పులు సరిదిద్దుకునే అవకాశం లేనంత వేగంగా అవి పూర్తయయి.. రిలీజ్ కూడా అయిపోయాయని.. అవి సరిగా ఆడలేదని.. ఇకపై అలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త వహిస్తున్నానని కిరణ్ చెప్పాడు. ‘రూల్స్ రంజన్’లో కామెడీ ప్రధానంగా సాగే సినిమా అని.. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే లక్ష్యంగా తీశామని.. ఇది ప్రేక్షకుల మనసులు గెలుస్తుందని అతను ధీమా వ్యక్తం చేశాడు. తాను కొత్తగా ఒక ప్రేమకథ, ఒక పీరియాడిక్ కథ చేస్తున్నానని.. తన కొత్త తసినిమా కోసం ఆరు నెలలు టైం తీసుకుని స్క్రిప్ట్ మీద కసరత్తు చేస్తున్నానని అతను తెలిపాడు.