మాములుగా బాలకృష్ణ సినిమాలంటే మాస్ ఆడియన్స్ ని లక్ష్యంగా పెట్టుకునేలా దర్శక నిర్మాతలు ప్రమోషన్ చేసుకుంటారు. గత రెండు బ్లాక్ బస్టర్స్ అఖండ, వీరసింహారెడ్డి ఆ రకంగా గొప్ప విజయం సాధించినవే. అయితే భగవంత్ కేసరి విషయంలో మాత్రం దర్శకుడు అనిల్ రావిపూడి కొత్త స్ట్రాటజీతో అభిమానులని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇప్పటిదాకా రెండు లిరికల్ వీడియో సాంగ్స్ వచ్చాయి. ఏదీ డ్యూయెట్ కాదు. పోనీ స్పెషల్ నెంబరూ కాదు. శ్రీలీల, బాలయ్యల అనుబంధాన్ని హైలైట్ చేసేలా వేర్వేరు సందర్భాలకు సంబంధించినవి. ఒకటి వినాయకుడిది, మరొకటి తండ్రి సెంటిమెంట్ ది.
భగవంత్ కేసరిలో బోలెడు కమర్షియల్ అంశాలు, ఫ్యాన్స్ కి కిక్కిచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నప్పటికీ ఒక ప్లానింగ్ ప్రకారమే ఆడియెన్స్ మైండ్ లో ఈ చిత్రాన్ని రిజిస్టర్ చేస్తున్నారు. ప్రాణంగా చూసుకుంటూ పెంచి పెద్ద చేసిన పాప కోసం ఎంత దూరమైనా వెళ్లే ఒక పవర్ ఫుల్ పాత్రలో బాలయ్య కనిపించనున్నారనే వార్త గతంలోనే వచ్చింది. దానికి బలం చేకూర్చేలా శ్రీలీలతో ఆయనకున్న బాండింగ్ ని పాటల రూపంలో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. హీరోయిన్ కాజల్ అగర్వాల్ కన్నా ఎక్కువగా శ్రీలీల మీద ఫోకస్ ఉండటం గమనించాల్సిన అంశం. ఇదంతా పబ్లిసిటీ స్ట్రాటజీలో భాగమే.
ఈ వారంలో రిలీజ్ చేయబోతున్న ట్రైలర్ లో అసలు మాస్ ని చూపించబోతున్నారు. ఏపీ రాజకీయ వాతావరణంలో అనిశ్చితి ఉన్నప్పటికీ అక్టోబర్ 19 విడుదల తేదీలో ఎలాంటి మార్పు ఉండదని నిర్మాతలు క్రమం తప్పకుండా అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. అదే రోజు విజయ్ లియోతో తీవ్రమైన పోటీ ఉన్నా అనిల్ రావిపూడి పటాస్ మార్కు టేకింగ్ మీద అభిమానులు పూర్తి నమ్మకంతో ఉన్నారు. మరుసటి రోజు టైగర్ నాగేశ్వరరావు ఉండటంతో ఓపెనింగ్స్ పరంగా కొంత ప్రభావం పడే ఛాన్స్ ఉన్నప్పటికీ బాలయ్య మాస్ సినిమా ట్యాగ్ లైన్ కు తగ్గట్టు డోంట్ కేర్ అంటుందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.