థియేటర్లు దొరకనందుకు సిద్దార్థ్ భావోద్వేగం

తెలుగులో స్ట్రెయిట్ సినిమాలు చేయడం తగ్గించాడు కానీ సిద్దార్థ్ అంటే టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఇప్పటికీ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఫ్యామిలీ చిత్రాల్లో ఒక ట్రెండ్ గా నిలిచిపోయిన బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి బ్లాక్ బస్టర్స్ అతని స్థానాన్ని స్పెషల్ గా నిలిపాయి. ఆ తర్వాత క్రమంగా ఫ్లాపులు ఎదురవ్వడంతో పూర్తిగా కోలీవుడ్ కే అంకితమైపోయాడు. ఆ మధ్య శర్వానంద్ తో కలిసి మహాసముద్రంలో చాలా ప్రాధాన్యం ఉన్న సెకండ్ హీరో పాత్ర చేసినప్పటికీ అది డిజాస్టర్ కావడం నిరాశ పరిచింది. ఈ శుక్రవారం చిన్నాతో థియేటర్ ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.

ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్ లో సిద్దార్థ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఎందుకంటే ఇది తన స్వంత సినిమా. నిర్మాణ బాధ్యతల్లో భాగం పంచుకున్నాడు. ఒరిజినల్ వెర్షన్ రిలీజైన సెప్టెంబర్ 28నే తెలుగులోనూ వదలాలని ప్లాన్ చేసుకున్న సిద్ధూకి బయ్యర్ల నుంచి సహకారం లేక థియేటర్లు దొరకలేదు. దీంతో తప్పని పరిస్థితుల్లో వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఈలోగా తమిళంలో మంచి టాక్ తో చిత్తా సూపర్ హిట్ దిశగా వెళ్తోంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకూడదని విపరీతంగా ప్రయత్నిస్తే అప్పుడు ఏషియన్ ఫిలింస్ సునీల్ నారంగ్ అండగా నిలవడంతో దారి సుగమం అయ్యింది.

ఇదంతా వివరించేటప్పుడు సిద్దార్థ్ దాదాపు కన్నీళ్లు పెట్టుకున్నంత పని చేశాడు.  స్పీచ్ మధ్యలో మాటలు రాక నిలుచుండిపోయాడు. ఒకవేళ చిన్నా కనక మీకు నచ్చకపోతే, మిమ్మల్ని సంతృప్తిపరచలేదని భావిస్తే ఇంకెప్పుడు ఇటు పక్క రానని ఎమోషనలయ్యాడు. దీన్ని బట్టి సిద్దార్థ ఈ సినిమాని ఎంత పర్సనల్ గా తీసుకున్నాడో అర్థమవుతోంది. ఇంత కష్టపడ్డాడు కానీ చాలా తీవ్రమైన పోటీ ఉన్న పరిస్థితుల్లో చిన్నా థియేటర్లలో నెగ్గుకురావడం అంత సులభమైతే కాదు. చిన్నపిల్లల లైంగిక వేధింపులకు క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ ని జోడించి ఒక సీరియస్ మెసేజ్ తో దర్శకుడు అరుణ్ కుమార్ చిన్నాని రూపొందించారు.