మ్యాడ్ ప్రీమియర్ల మీద పెద్ద నమ్మకమే

స్టార్లు లేకుండా కేవలం యూత్ ని నమ్ముకుని సినిమాలు తీసి సరిగ్గా టార్గెట్ ని కనక మెప్పిస్తే బ్లాక్ బస్టర్ ఖాయమని గతంలో చిత్రం, నువ్వే కావాలి, కొత్త బంగారు లోకం, హ్యాపీ డేస్ లాంటివి ఎన్నో నిరూపించాయి. అందుకే మ్యాడ్ మీద నిర్మాతలు చాలా ధీమాగా ఉన్నారు. నిర్మాత నాగవంశీ దీనికి జాతిరత్నాలు కన్నా ఎక్కువ నవ్వకపోతే టికెట్ డబ్బులు వాపస్ ఇస్తానని సవాల్ చేయడం గత వారమే వైరల్ అయ్యింది. విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో రెండు రోజుల ముందే ప్రీమియర్లు వేసేందుకు సిద్ధమయ్యారు. ఒకరకంగా చెప్పాలంటే ఇది సవాల్ ని స్వీకరించడం లాంటిది.

హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, రాజమండ్రి, కాకినాడ, గుంటూరు నగరాల్లో 5వ తేదీనే స్పెషల్ షోలు వేయబోతున్నారు. మరికొన్ని సెంటర్లు జోడించే పనులు జరుగుతూన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ అయ్యాక స్పందన బాగుంది. యువతను నవ్వించే హిలేరియస్ ఎంటర్ టైన్మెంట్ ఉందనే హామీ అయితే దొరికింది. సినిమా మొత్తం ఇలాగే ఉంటె ఖచ్చితంగా భారీ స్పందన ఆశించవచ్చు. పైగా ఇంత త్వరగా షోలు వేస్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో దాని టాక్ పాజిటివ్ అయినా నెగటివ్ అయినా వేగంగా  బయటికి వస్తుంది.

అక్టోబర్ 6న కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇలాంటి ఎత్తుగడ మంచిదే. దసరా కొత్త రిలీజుల వరకు చూసుకుంటే మొత్తం 13 రోజుల టైం దొరుకుతుంది. మ్యాడ్ కి కనక పాజిటివ్ టాక్ వస్తే బ్రేక్ ఈవెనే కాదు మంచి లాభాలనూ వెనకేసుకోవచ్చు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించగా తారక్ బావమరిది నార్నె నితిన్ హీరోగా నటించడం ఫ్యాన్స్ లో ఆసక్తి పెంచుతోంది. ఆ మధ్య మేం ఫేమస్ ఇలాగే తెగ హడావిడి చేసి అంచనాలను అందుకోలేకపోయింది. కానీ మ్యాడ్ కు ఆ సమస్య కనిపించడం లేదు. పూర్తిగా కాలేజీ బ్యాక్ డ్రాప్ తీసుకోవడంతో కనెక్టయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అది ఎంత స్థాయనేది ఎల్లుండి తేలనుంది.