బాలయ్యతో మీనాక్షి.. సూటవుతుందా?

మీనాక్షి చౌదరి.. ప్రస్తుతం సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఈ అమ్మాయి గురించే చర్చంతా. సుశాంత్ సరసన ‘ఇచట వాహనములు నిలుపరాదు’ అనే చిన్న సినిమాతో ఆమె టాలీవుడ్లోకి అడుగు పెట్టింది. తొలి చిత్రం ప్రేక్షకుల దృష్టిలోనే పడకుండా వెళ్లిపోయింది. రెండో చిత్రం ‘ఖిలాడి’ డిజాస్టర్ అయింది. అయినా సరే.. ఈ అమ్మాయికి టైం బాగానే కలిసొచ్చింది. అడివి శేష్ సరసన చేసిన ‘హిట్-2’ హిట్టయింది. కొంచెం గ్యాప్ తర్వాత ఆమెకు అవకాశాలు వరుస కట్టాయి.

మహేష్ బాబుకు జోడీగా ‘గుంటూరు కారం’లో కథానాయికగా ఎంపిక కావడం మీనాక్షి కెరీర్లో అతి పెద్ద మలుపు. ఈ మధ్య ఆమె చేసిన గ్లామర్ షోతో సోషల్ మీడియా ఊగిపోయింది. తమిళంలో ఆమె నటించిన ‘కొలై’ (తెలుగులో హత్య) సరిగా ఆడకపోయినా తన నటన, గ్లామర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఏకంగా విజయ్ కొత్త సినిమాలో ఆమె ఛాన్స్ పట్టేసింది. 

దీంతో రెండు రోజులుగా మీనాక్షి పేరు మార్మోగిపోతోంది సామాజిక మాధ్యమాల్లో. ఇదే టైంలో మీనాక్షి మరో కొత్త సినిమా గురించి రూమర్ వినిపిస్తోంది. సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ సరసన ఆమె నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. బాబీ దర్శకత్వంలో బాలయ్య హీరోగా ఒక సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లడంలో కొంత ఆలస్యం జరుగుతోంది.

ప్రి ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రానికి మీనాక్షిని కథానాయికగా ఎంపిక చేసినట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. కానీ బాలయ్య సరసన మీనాక్షి సెట్ అవుతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆయన పక్కన ఆమె మరీ చిన్న పిల్ల అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లుక్స్ పరంగా కూడా బాలయ్య లాంటి ఊర మాస్ హీరో పక్కన క్లాస్‌గా ఉండే మీనాక్షి సెట్ కాదనిపిస్తోంది. పైగా మహేష్, విజయ్ లాంటి హీరోల పక్కన చేస్తూ పెద్ద రేంజికి వెళ్తున్న దశలో బాలయ్య లాంటి సీనియర్ సరసన నటిస్తే మీనాక్షి కెరీర్‌కు కూడా అది మైనస్ కావచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవతున్నాయి.