సంక్రాంతికి ఎన్ని సినిమాలు వస్తాయో అంతు చిక్కనంతగా ప్రకటనల ప్రహసనం కొనసాగుతోంది. తాజాగా లాల్ సలాం కూడా పండగ బరిలో దూకేందుకు సిద్ధమయ్యింది. కేవలం హీరో విష్ణు విశాల్ మూవీగా చూస్తే దీని గురించి మనం ఆలోచించాల్సిన పని ఉండేది కాదు. కానీ సూపర్ స్టార్ రజనీకాంత్ లెన్త్ ఉన్న ప్రత్యేక పాత్ర చేయడం వల్ల దీన్ని ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సిందే. ఆయన కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో రూపొందిన ఈ స్పోర్ట్స్ కం గ్యాంగ్ స్టర్ డ్రామా షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. జైలర్ రిలీజ్ కు ముందే తండ్రి పోర్షన్లను కూతురు పూర్తి చేసింది.
ఇప్పుడీ ఎంట్రీ వల్ల పోటీ మరింత రసవత్తరంగా మారింది. గుంటూరు కారం, ఈగల్, ఫ్యామిలీ స్టార్, హనుమాన్ లు ఆల్రెడీ మేం తగ్గేదేలే అంటూ ఎప్పటికప్పుడు అప్డేట్లు ఇస్తూనే ఉన్నారు. శివ కార్తికేయన్ అయలన్ మొన్నటి వారమే అనౌన్స్ మెంట్ ఇచ్చింది. నిన్న అరన్మనయ్ 4 ప్రకటన వచ్చింది. ఇప్పుడీ లాల్ సలాం. క్యాస్టింగ్ ఉంది కాబట్టి ఇవన్నీ తెలుగు డబ్బింగ్ హక్కులు మన నిర్మాతల్లో ఎవరో ఒకరు కొంటారు. తక్కువో ఎక్కువో దొరికినన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటారు. అలాంటప్పుడు సహజంగానే మనవాటికి స్క్రీన్లు కొన్ని తగ్గిపోతాయి.
ఇలా ఎవరికి వారు అందరూ సంక్రాంతే కావాలని పట్టుబట్టడం జనవరి డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద సవాల్ విసిరేలా ఉంది. అందరినీ సంతృప్తిపరిచేలా సర్దుబాటు చేయడం పెద్ద సవాలే. మహేష్ బాబు, రవితేజ, విజయ్ దేవరకొండ, తేజ సజ్జ, రజనీకాంత్ ఇలా ఎవరినీ తక్కువ చేసేందుకు అవకాశం లేకుండా భారీ కంటెంట్లతో సిద్ధమవుతున్నారు. ఎవరైనా డ్రాప్ అవుతారా అంటే ఆ సూచనలేమీ కనిపించడం లేదు. ప్రాజెక్ట్ కె తప్పుకోకపోయి ఉంటే ఇవాళ పరిస్థితి వేరుగా ఉండేది. కానీ అది రాదని తేలిపోవడంతో నువ్వా నేనా అనే సవాళ్లతో ప్రొడ్యూసర్లు సిద్ధమవుతున్నారు. ఈ ప్రవాహం ఇక్కడితో ఆగేలా లేదు
Gulte Telugu Telugu Political and Movie News Updates