డబుల్ ఇస్మార్ట్ సంగీతం కుదిరింది

ఎనర్జిటిక్ స్టార్ రామ్ దర్శకుడు పూరి జగన్నాధ్ కాంబోలో రూపొందుతున్న డబుల్ ఇస్మార్ట్ సంగీత దర్శకుడికి సంబంధించిన సస్పెన్స్ తీరిపోయింది. ఇస్మార్ట్ శంకర్ కి అదిరిపోయే మాస్ ఆల్బమ్ తో పాటు బీజీఎంతో ప్రాణం పోసిన మణిశర్మనే ఫైనల్ గా లాక్ చేశారని తెలిసింది. ఒక పాటకు సంబంధించిన ట్యూన్ తో పాటు ఫైనల్ కంపోజింగ్ కూడా ఓకే అయిపోయిందని సమాచారం. నిజానికీ ప్రాజెక్టు ప్రకటించినప్పుడు మణిశర్మ పేరు లేదు. పూరితో ఏవో విభేదాలు ఉన్నాయని, పైగా ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి హిందీ వైపు టీమ్ మొగ్గు చూపుతోందనే ప్రచారం జరిగింది.

అవేవి కాదని తేలిపోయింది. అయితే దీని వెనుక పెద్ద కసరత్తే జరిగినట్టు ఇన్ సైడ్ టాక్. ముందు తమన్, అనిరుధ్ లాంటి వాళ్ళతో మాట్లాడారు కానీ ప్రకటించిన రిలీజ్ డేట్ లోపు పనులు జరగాలంటే వాళ్ళతో కుదరదని గుర్తించి ఫైనల్ గా మెలోడీ బ్రహ్మకే ఓటేశారని అంటున్నారు. పైగా మొదటి భాగంలోని పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంతో కొంత వాడకుండా సీక్వెల్ ని నడిపించడం కష్టం. ఒకవేళ అదే జరిగితే కాపీ రైట్స్ సమస్య వస్తుంది. ఎంత పూరి స్వంత సినిమా అయినా సరే ఆడియో కంపెనీ, మ్యూజిక్ డైరెక్టర్ అంగీకారం లేకుండా వాడుకుంటే అదో సమస్యే.

ఇవన్నీ అలోచించి మణిశర్మకే డబుల్ ఇస్మార్ట్ ఇవ్వడం మంచి నిర్ణయం. అయితే ఇటీవలి కాలంలో ఈయన తన స్థాయి సంగీతం ఇవ్వలేకపోతున్నారు. శాకుంతలం, ఆచార్య లాంటివి ఎంత డిజాస్టర్ అయినా కనీసం వాటిలో పాటలు పర్వాలేదనిపించుకున్నా బాగుండేది. అదీ జరగలేదు. సో ఇప్పుడు పూరి మణితో ఎలాంటి అవుట్ ఫుట్ రాబట్టుకుంటాడనేది కీలకం. తగినంత సమయం దొరుకుతుంది కాబట్టి బెస్ట్ ఆశించవచ్చు. 2024 మార్చి 8 విడుదల కాబోతున్న డబుల్ ఇస్మార్ట్ లో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ కీలక భాగం పూర్తి చేశారు కూడా.