దిల్ రాజు ఫ్రస్టేషన్ పీక్స్

టాలీవుడ్లో సినిమాల నిర్మాణ వ్యవహారాలు పూర్తిగా మారిపోయాయి. నిర్మాత డమ్మీ అయిపోయి హీరోలు.. దర్శకుల ఆధిపత్యమే నడుస్తోంది. ప్రొడ్యూసర్ అంటే డబ్బులు పెట్టే ఒక మెషీన్ లాగా మారిపోయాడని సీనియర్ నిర్మాతలు చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. నిర్మాత కంట్రోల్లో ఏదీ ఉండట్లేదని.. అందుకే తాము సినిమాల నిర్మాణానికే  దూరమైపోయామని కూడా చెబుతుంటారు.

కానీ ఇలాంటి టైంలో కూడా ప్రొడక్షన్ మీద పూర్తి కంట్రోల్ తెచ్చుకుని.. ఒక ప్రణాళిక ప్రకారం సినిమాలు తీసే అతి కొద్ది మంది నిర్మాతల్లో దిల్ రాజు ఒకడు. ఎంత పెద్ద స్టార్ హీరోతో సినిమా చేసినా.. ఎంత పెద్ద దర్శకుడితో కలిసి పని చేసినా.. దిల్ రాజు ప్లాన్ ప్రకారమే ప్రొడక్షన్ నడుస్తుంది. హీరోలు, దర్శకులకు వారి మార్కెట్ స్థాయికి తగ్గట్లు పారితోషకాలు ఇచ్చి.. ప్రొడక్షన్ అంతా కూడా తన ప్లాన్ ప్రకారమే జరిగేలా చూసుకుంటాడని రాజుకు పేరుంది.

రెండు దశాబ్దాలుగా రాజు బేనర్ నుంచి వచ్చిన ప్రతి సినిమాకూ ప్లాన్ ప్రకారమే అన్నీ నడిచాయి. కానీ ఒక్క ‘గేమ్ చేంజర్’ విషయంలో మాత్రం ఏదీ ఆయన చేతుల్లో ఉండట్లేదు. తమిళ దర్శకుడు శంకర్‌ను నమ్మి ఆయన దారుణంగా దెబ్బ తిన్నారు. నిజానికి దీని కంటే ముందు శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్-2’ సినిమాను నిర్మించాల్సింది రాజు. కానీ ఆ సినిమా విషయంలో ఆయనకు ఏవో డౌట్లు కొట్టి వెనక్కి తగ్గాడు. లైకా వాళ్లు ఆ ప్రాజెక్టును టేకప్ చేసి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

ఐతే ‘ఇండియన్-2’ నుంచి తప్పించుకున్నానని రాజు ఊపిరి పీల్చుకున్నా.. పరోక్షంగా ఆ ప్రాజెక్టు రాజును దెబ్బ తీసింది. ‘గేమ్ చేంజర్’ పని సాఫీగా సాగుతున్న సమయంలో.. ‘ఇండియన్-2’ను తిరిగి పట్టాలెక్కించి రెండు చిత్రాలనూ సమాంతరంగా షూట్ చేయాలన్న శంకర్ నిర్ణయానికి ఓకే చెప్పడమే రాజుకు శాపమైంది. అప్పట్నుంచి ‘గేమ్ చేంజర్’ ముందుకు సాగట్లేదు. ‘ఇండియన్-2’ షూట్ పూర్తయ్యాక కూడా ‘గేమ్ చేంజర్’కు పట్టిన గ్రహణం వీడట్లేదు. ఇటీవల కొత్త షెడ్యూల్ కోసం అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాక ఏవో కారణాలతో రద్దయింది.

ఇప్పటికే ఎంతో ఓర్పుతో నష్టాన్ని భరిస్తూ వచ్చిన రాజు.. తాజా షెడ్యూల్ రద్దుతో తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది. ఇన్నేళ్ల కెరీర్లో ఏ సినిమాకూ జరగని విధంగా ‘గేమ్ చేంజర్’కు జరుగుతుండటం.. పూర్తిగా ఈ ప్రాజెక్టు తన కంట్రోల్ తప్పి.. వడ్డీల భారం పెరిగి నిర్మాణ వ్యయం తడిసి మోపెడవుతుండటంతో సన్నిహితుల వద్ద ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. కానీ ఈ దశలో శంకర్ మీద కోప్పడితే.. సినిమాకు అది చేటు చేస్తుందన్న ఉద్దేశంతో ఆయన ఓపిక వహిస్తున్నట్లు తెలుస్తోంది.