సంక్రాంతి పోటీలో అందమైన దెయ్యాలు

ఇప్పటికే ప్రకటించిన సినిమాలతో 2024 సంక్రాంతి గురించి అలోచించి బుర్రలు వేడెక్కుతుంటే కొత్త అనౌన్స్ మెంట్లతో పోటీ మరింత టైట్ గా మారిపోతోంది. తాజాగా ‘అరణ్మనయ్ 4’ పొంగల్ బరిలో దింపుతున్నట్టు నిర్మాతలు కొత్త పోస్టర్ వదిలారు. దీని మొదటి మూడు భాగాలు తెలుగులోనూ వచ్చాయి. ఫస్ట్ ది ‘చంద్రకళ’ కమర్షియల్ గా ఇక్కడా విజయం సాధించగా ‘కళావతి’ యావరేజ్ అయ్యింది. గత ఏడాది వచ్చిన ‘అంతఃపురం’ ఆశించిన ఫలితం అందుకోలేదు. వీటన్నిటిలో ఆకర్షణీయమైన స్టార్ క్యాస్టింగ్ తో దర్శకుడు సి సుందర్ దెయ్యాల జానర్ లో తీశాడు. ఇప్పుడొచ్చేది నాలుగో భాగం.

ఇందులో రాశి ఖన్నా, తమన్నా భాటియా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వీళ్ళను దెయ్యాలుగా చూపించబోతున్నట్టు చెన్నై టాక్. త్రిష, హన్సిక లాంటి అందెగత్తెలనే ఆత్మలుగా చూపించి భయపెట్టిన సుందర్ కి ఇదేమి కొత్త కాదు. యోగిబాబు లాంటి కమెడియన్లు ఇందులో ఉన్నారు. డబ్బింగ్ కు సంబంధించి ఇంకా లావాదేవీలు జరగలేదు కాబట్టి టైటిల్ గట్రా తర్వాత డిసైడ్ చేస్తారు. అయితే దీన్నిగట్టి పోటీ అనుకోవడానికి లేదు కానీ ఇంత సాహసం చేయడం వెనుక కారణం ఉంది. కోలీవుడ్ లో సంక్రాంతికి శివ కార్తికేయన్ అయలన్ ఒకటే ఫిక్స్ చేశారు. స్టార్ హీరోలెవరివి లేవు.

అందుకే ఈ ఛాన్స్ వాడుకోవడానికి అరణ్మనయ్ టీమ్ నిర్ణయించుకుంది. ఇతర భాషల్లో ఆడినా ఆడకపోయినా పెద్దగా తేడా ఉండదు కానీ స్వంత మార్కెట్ ని మాత్రమే టార్గెట్ చేసుకున్నారు. అయినా ఎంతో కొంత రాబట్టుకోవచ్చనే ఉద్దేశంతో మన నిర్మాతల్లో ఎవరో ఒకరు హక్కులు కొంటారు కాబట్టి ఏదోలా థియేటర్ల సర్దుబాటు చేయాల్సిందే. పైగా తమన్నా, రాశిఖన్నా పోస్టర్లతో మార్కెటింగ్ జరుగుతుంది కనక మరీ తీవ్రంగా తక్కువంచనా వేయడానికి లేదు. ఇంకా మూడు నెలలు టైం ఉంది కాబట్టి ఇంకా ఏమేం బాక్సాఫీస్ పరిణామాలు జరుగుతాయో చూడాలి.