రజనీకాంత్ జంపు లారెన్స్ బలి

నిన్న విడుదలైన చంద్రముఖి 2 చూసి ప్రేక్షకులే కాదు అభిమానులూ పెదవి విరిచారు. ఒరిజినల్ వెర్షన్ నే మళ్ళీ తీయడం పట్ల దర్శకుడు పి వాసు మీద విమర్శల వర్షం గుప్పిస్తున్నారు. నిజానికీ సీక్వెల్ రజనీకాంత్ తో తీసి ఉంటే బాగుండేదని ప్రకటన వచ్చినప్పుడు ఫ్యాన్స్ కోరుకున్నారు. కానీ అనూహ్యంగా లారెన్స్ వచ్చి చేరాడు. సరే ఈయనా దెయ్యాల స్పెషలిస్టే కాబట్టి బాగానే ఉంటుందని ఎదురు చూశారు. కంగనా రౌనత్, ఎంఎం కీరవాణి లాంటి ఆకర్షణలు వచ్చి చేరాక అంచనాలు మెల్లగా ఎగబాకాయి. ముఖ్యంగా లైకా ప్రొడక్షన్స్ నిర్మాణం అనగానే ఆసక్తి రేగిన మాట వాస్తవం.

కట్ చేస్తే చంద్రముఖి 2 చూశాక రజనీకాంత్ జంపు కొట్టడం వల్లే లారెన్స్ బలయ్యాడనే అభిప్రాయం అందరికీ కలుగుతోంది. ఏ మాత్రం మార్పు లేకుండా పద్దెనిమిదేళ్ల క్రితం వచ్చిన కథనే మళ్ళీ తిప్పి తీస్తే అందులో నటించడం కన్నా దూరంగా ఉండి చూడటం సేఫని తలైవర్ భావించారు. అందుకే కథని వినకుండా వాసుని లారెన్స్ తో ప్రొసీడ్ అవ్వమని చెప్పేశారు. ఒకవేళ విని ఉంటే తాను ఎంతో ఇష్టపడే తమ్ముడు లాంటి లారెన్స్ కి చేయొద్దని సలహా ఇచ్చేవారేమో. ఏది ఏమైనా చంద్రముఖి బ్రాండ్ ని క్యాష్ చేసుకోవాలనుకున్న మేకర్స్ తాపత్రయం చేదు ఫలితాన్ని ఇచ్చింది.

ఓపెనింగ్స్ అయితే తమిళనాడులో బాగానే వచ్చాయి కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సోసోగా నమోదయ్యాయి. కొన్ని బిసి సెంటర్స్ లో మాత్రం నిన్న సెలవు రోజు కావడంతో మ్యాట్నీలు, ఈవెనింగ్ షోలు ఫుల్ అయ్యాయి. అయితే వాటి నుంచి వచ్చిన టాక్ నిరాశాజనకంగా ఉండటం ఇవాళ్టి నుంచి ఎదురీదాల్సి ఉంటుంది. లారెన్స్, కంగనా రౌనత్ లు హైదరాబాద్ కు వచ్చి ప్రమోషన్లు చేసుకున్నా లాభం లేకపోయింది. మాస్ లో మంచి పట్టున్న లారెన్స్ ఈ మధ్య కథల ఎంపికలో చేస్తున్న తప్పుల వల్ల క్రమంగా పట్టు తప్పుతున్నాడు. చంద్రముఖి 2 దీనికి మరింత డ్యామేజ్ చేసేలా ఉంది.