హనుమాన్ పంతం వీడితే మంచిదేమో

సంక్రాంతి పోటీ గురించి ఇండస్ట్రీలో ఎడతెగని చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఎవరు ఉంటారు ఎవరు తప్పుకుంటారనే దాని మీద పేరు మోసిన బయ్యర్లు సైతం అంచనా వేయలేకపోతున్నారు. నిర్మాతలు ఎవరికి వారు ఖచ్చితంగా విడుదల చేస్తామనే ధీమాలో ఉన్నారు. మహేష్ బాబు, రవితేజ, విజయ్ దేవరకొండల ఇమేజ్ తో పోలిస్తే తేజ సజ్జ వాళ్ళ దరిదాపుల్లో కూడా ఉండడు. అయినా సరే దర్శకుడు ప్రశాంత్ వర్మ విజువల్ ఎఫెక్ట్స్ ని నమ్ముకుని హనుమంతుడి సెంటిమెంట్ గెలుపునిస్తుందని నమ్మకంతో ఉన్నాడు. ప్రత్యేకంగా హీరో మార్కెట్ కంటే కంటెంట్ మీదే ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు.

ప్రాక్టికల్ గా ఆలోచిస్తే హనుమాన్ అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చి ఉండొచ్చు కానీ థియేటర్ల అందుబాటులో దృష్టిలో ఉంచుకుని చూస్తే స్క్రీన్ల లభ్యత విడుదల సమయానికి ఇబ్బందిగా మారుతుంది. ఒకవేళ గుంటూరు కారం వాయిదా పడుతుందనే డౌట్ ఉంటే అది వేరే సంగతి. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టార్గెట్ మిస్ చేసుకునే ఉద్దేశంలో ఎంత మాత్రం లేరు. ఈగల్ ఆల్రెడీ పూర్తయిపోయింది. ఫ్యామిలీ స్టార్ సగం ఫినిష్ చేసుకుని డిసెంబర్ చివరి కల్లా ఫస్ట్ కాపీని సిద్ధం చేసుకుంటుంది. కాబట్టి ఎవరూ రాజీ పడే దిశగా ఆలోచించడం లేదనేది కన్ఫర్మ్.

ఇక హనుమాన్ ప్యాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో సరైన ప్రమోషన్లు చేసుకోవలసిన సినిమా. బడ్జెట్ కూడా భారీగా ఖర్చు పెట్టారు. విజువల్స్ చాలా బాగున్నాయని రషెస్ చూసినవాళ్లు అంటున్నారు. సో సోలో రిలీజ్ కు వెళ్లడమే ఉత్తమ మార్గం. లేదూ ఎదురుగా ఎవరున్నా పర్వాలేదు అనుకుంటే ఓపెనింగ్స్ మీద ఖచ్చితంగా దెబ్బ పడుతుంది. పైగా గుంటూరు కారంతో అదే తేదీకి తలపడటం చాలా పెద్ద రిస్క్. దానికి యావరేజ్ టాక్ వచ్చినా చాలు ఆ వసూళ్ల ప్రభంజనం ముందు నిలవడం కష్టం. మరి హనుమాన్ పంతం వీడుతుందో లేక తగ్గేదేలే అంటుందో వేచి చూడాలి.