సంక్రాంతి సీజన్ గురించి ఆల్రెడీ టాలీవుడ్ వర్గాల్లో ఎంత పెద్ద చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఎవరు వస్తారో ఎవరు చివరి దాకా ఉంటారో అర్థం కాక డిస్ట్రిబ్యూటర్లు టెన్షన్ పడుతున్నారు. ఇప్పటిదాకా ఖచ్చితంగా రిలీజ్ చేస్తామని చెప్పిన సినిమాలు గుంటూరు కారం, హనుమాన్, ఈగల్. ఎలాగూ సలార్ డిసెంబర్ అంటున్నారు కాబట్టి టెన్షన్ లేదు. సరే ఇంత పోటీ ఉన్నా సరే నిర్మాత దిల్ రాజు మాత్రం విజయ్ దేవరకొండ 13 (ఫ్యామిలీ స్టార్ టైటిల్ పరిశీలనలో ఉంది)ని ఎట్టి పరిస్థితుల్లో పండగ బరిలో దింపాలని గట్టిగా డిసైడైపోయారు. ఆ మేరకు అఫీషియల్ గా ప్రీ లుక్ రూపంలో హింట్ కూడా ఇచ్చేశారు.
బాగానే ఉంది కానీ మహేష్ బాబు, రవితేజలను ఎదురుగా పెట్టుకుని విజయ్ దేవరకొండతో ఇంత రిస్క్ చేయడం ఏమిటనే సందేహం వస్తోందా. ఇక్కడ దిల్ రాజు క్యాలికులేషన్లు వేరు. ఈ ఏడాది జనవరిలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి లాంటి దిగ్గజాల నడుమ తన డబ్బింగ్ మూవీ వారసుడుని దింపారు. కంటెంట్ ఎంత రొటీన్ గా ఉన్నా, ఫ్లాప్ టాక్ మూటగట్టుకున్నా కమర్షియల్ గా దానికైన ఖర్చుకి బాగానే ఆడి లాభాలు కూడా ఇచ్చింది. అజిత్ తెగింపుని సైతం లెక్కచేయలేదు. గతంలో ఖైదీ నెంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి మధ్య శతమానంభవతితో బంపర్ హిట్టు కొట్టడం ఆయనకు అనుభవమే.
ఈ నమ్మకంతోనే రేస్ లో ఎన్ని ఉన్నా సరే తన ఫ్యామిలీ స్టార్ గుర్రాన్ని పందెంలో దింపాలని నిర్ణయించుకున్నారు. ఎలాగూ ఈ సీజన్ సులభంగా ముగ్గురు హీరోలకు టాక్ తో సంబంధం లేకుండా బ్రేక్ ఈవెన్ దాటించే సత్తా చూపిస్తుంది. అలాంటప్పుడు విజయ్ దేవరకొండకున్న ఇమేజ్ కి జనాన్ని థియేటర్లకు రప్పించడం పెద్ద కష్టం కాదు. పైగా సర్కారు వారి పాట ఫైనల్ రిజల్ట్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో దర్శకుడు పరశురామ్ ఈ స్క్రిప్ట్ మీద చాలా వర్క్ చేశాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ ఫ్యామిలీ డ్రామాకు గోపి సుందర్ సంగీతం సమకూరుస్తున్నాడు.