లియో రద్దు వెనుక ఎన్నెన్ని రాజకీయాలో

ఈ నెల 30 చెన్నైలో గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్న లియో ఆడియో కం ప్రీ రిలీజ్ ఈవెంట్ హఠాత్తుగా రద్దు చేయడం విజయ్ అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది. టికెట్లకు విపరీతమైన డిమాండ్ ఉన్న కారణంగా వాటిని అందుకోలేకపోతున్నట్టు అందుకే క్యాన్సిల్ చేస్తున్నట్టు నిర్మాణ సంస్థ ఇచ్చిన వివరణ మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైపోయింది. రద్దీ నియంత్రించడం కష్టంగా అనిపిస్తోందని ఇంకో రీజెన్ కూడా చెప్పారు. ఇవేవి అభిమానుల ఆగ్రహాన్ని చల్లార్చడం లేదు. పై పెచ్చు ఇప్పటికే ఉన్న అనుమానాలను మరింత బలపరిచేవిగా ఉన్నాయని భగ్గుమంటున్నారు

తమిళనాడు సీఎం స్టాలిన్ వారసుడు కం హీరో  కం డిస్ట్రిబ్యూటర్ ఉదయనిధి వల్లే ఇదంతా జరిగిందని చెన్నై వర్గాల్లో వేడి చర్చ జరుగుతోంది. ఆయనకు చెందిన రెడ్ జాయింట్ సంస్థకు లియో పంపిణి హక్కులు ఇవ్వనందు వల్లే ఉద్దేశపూర్వకంగా అనుమతులు రాకుండా చేశారని, ఒకవేళ ఆ కండీషన్ కి ఒప్పుకుని ఉంటే వేడుకకి రూట్ క్లియరయ్యేదని ఓపెన్ కామెంట్స్ పెడుతున్నారు. అంతే కాదు విజయ్ పొలిటికల్ ఎంట్రీ అతిత్వరలో ఉంటుందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో స్టాలిన్ సర్కార్ కావాలని ఇబ్బందులు సృష్టిస్తోందనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.

వీటిలో నిజానిజాలు కాసేపు పక్కనపెడితే లియో కన్నా భారీ ఈవెంట్లు ఎన్నో గతంలో చెన్నైతో పాటు దేశమంతా పలు నగరాల్లో వందల సంఖ్యలో జరిగాయి. రామోజీ ఫిలిం సిటీలో సాహో ఈవెంట్ కి లక్షకు పైగా జనం హాజరైనా ఎలాంటి ఇబ్బంది కలగలేదు. కానీ లియోకి ఎంచుకున్న స్టేడియం చిన్నది. సరైన ప్లానింగ్ తో సమస్యలు రాకుండా చేసుకోవచ్చు. కానీ అర్ధాంతరంగా రద్దు చేయడమే కాక వాటికి పేర్కొంటున్న కారణాలు సిల్లీగా ఉన్నాయని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. కేరళలో చేసుకోమని అక్కడి బయ్యర్లు ఆఫర్ ఇచ్చారట కానీ లియో టీమ్ దానికి సంసిద్ధంగా లేదు. మొత్తానికి ఈవెంట్ రాజకీయం రసవత్తరంగా మారింది.