సినిమా బాగా వచ్చిందనే కాన్ఫిడెన్స్ ప్రతి దర్శక నిర్మాతలోనూ ఉంటుంది. అది సహజం. ఈవెంట్లలో వాళ్ళ స్టేట్ మెంట్స్ దాన్ని ప్రతిబింబిస్తూ ఉంటాయి. వచ్చే నెల 6న విడుదల కాబోతున్న మ్యాడ్ నిర్మాత నాగవంశీ ఏకంగా టికెట్ డబ్బులు వెనక్కు ఇచ్చే ఛాలెంజ్ విసిరారు. ఇవాళ జరిగిన సాంగ్ లాంచ్ వేడుకలో గెస్టుల్లో ఒకరిగా విచ్చేసిన అనుదీప్ ని ఉద్దేశించి మాట్లాడుతూ జాతిరత్నాలు కంటే మ్యాడ్ చూసి తక్కువ నవ్వితే టికెట్ కోసం ఖర్చు పెట్టిన డబ్బులు వెనక్కు ఇస్తానని, అలా ఎవరు ట్విట్టర్ లో తనకు ఋజువు చేసినా యాంకర్ సుమ సాక్షిగా పైసల్ తిరిగి చెల్లించేస్తానని పబ్లిక్ గా అనేశారు.
సో మ్యాడ్ లో వినోదానికి ఢోకా లేదని హామీ అయితే ఇచ్చేశారు. వినడానికి బాగానే ఉంది కానీ సోషల్ మీడియాలో ఇలాంటి ఛాలెంజులు పబ్లిసిటీకి బాగా ఉపయోగపడతాయి. జనాలు పాజిటివ్ గా నెగటివ్ గా రెండు రకాలుగా స్పందిస్తారు. ఎలా రెస్పాండ్ అయినా సినిమాకు కావాల్సిన ప్రమోషన్ చక్కగా జరిగిపోతుంది. మ్యాడ్ లో స్టార్ క్యాస్టింగ్ లేదు. అందరూ కొత్త కుర్రాళ్లు నటించారు. టీజర్ చూశాక యూత్ జోకులు పుష్కలంగా దట్టించారనే మ్యాటర్ అర్థమైపోయింది. నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించగా కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు.
మరి ఈ ప్రామిస్ ఎంతమేరకు పని చేస్తుందో సినిమా రిలీజ్ రోజు చూడాలి. గత కొంత కాలంగా యువతకు యునానిమస్ గా నచ్చేవి పెద్దగా రాలేదు. మేం ఫేమస్, బాయ్స్ హాస్టల్ లాంటివి హడావిడి చేశాయి కానీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. అందుకే మ్యాడ్ మీద ఓ మోస్తరు అంచనాలు నెలకొన్నాయి. సుధీర్ బాబు మామా మశ్చీంద్ర, కలర్స్ స్వాతి మంత్ అఫ్ మధు, కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్ తో పోటీ పడబోతున్న మ్యాడ్ కు పబ్లిక్ టాక్ చాలా కీలకం. నాగవంశీ అన్నట్టు తక్కువో ఎక్కువో పక్కనపెడితే సరిపడా నవ్వించి టైం పాస్ చేయిస్తే చాలు హిట్ చేయడానికి జనాలు సిద్ధంగానే ఉన్నారు.