ఆ సీన్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్రెడిటేన‌ట‌..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్ కెరీర్లో మోస్ట్ స్పెష‌ల్ ఫిల్మ్ అంటే.. ఖుషినే. ప‌వ‌న్‌కు వేరే బ్లాక్‌బ‌స్ట‌ర్లు ఉన్న‌ప్ప‌టికీ.. దీన్ని అభిమానులు చాలా ప్ర‌త్యేకంగా భావిస్తారు. ఇది రీమేక్ మూవీనే అయిన‌ప్ప‌టికీ.. ఒరిజిన‌ల్‌తో పోలిస్తే ఇంకా బాగుంటుంది. త‌మిళంలో ఖుషి సూప‌ర్ హిట్ అని, మొద‌ట్లో దానికి డివైడ్ టాక్ వ‌చ్చింద‌ని.. కానీ తెలుగులో సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింద‌ని.. తొలి షో నుంచే ఇది చాలా పెద్ద రేంజికి వెళ్లింద‌ని.. తెలుగులో సినిమా ఆ రేంజికి వెళ్ల‌డానికి కార‌ణం ప‌వ‌న్ క‌ళ్యాణే అని స్వ‌యంగా ద‌ర్శ‌కుడు ఎస్.జె.సూర్య‌నే చెప్ప‌డం గ‌మ‌నార్హం.

ఇందులో క్రియేటివ్‌గా సాగే యాక్ష‌న్ సీక్వెన్సులు, యే మేరా జ‌హాన్ పాట ప‌వ‌న్ ఆలోచ‌న‌ల నుంచి పుట్టుకొచ్చిన‌వే అన్న సంగ‌తి తెలిసిందే. ఇది కూడా స్వ‌యంగా సూర్య‌నే వెల్ల‌డించాడు. ఐతే వీటితో పాటు మ‌రో స‌న్నివేశం ప‌వ‌న్ సెట్లో కూర్చుని అప్ప‌టిక‌ప్పుడు క్రియేట్ చేసిన విష‌యం ఇప్పుడు బ‌య‌టికి వ‌చ్చింది. క్లైమాక్సులో గుడుంబా స‌త్తిని క‌లిసే ముందు ప‌వ‌న్ ఒక కామెడీ ఫైట్ చేస్తాడ‌న్న సంగ‌తి తెలిసిందే. అందులో క‌మెడియ‌న్ బ‌బ్లూ కూడా చిన్న రోల్ చేశాడు.

చాలా చ‌మ‌త్కారంగా సాగుతుందా సీక్వెన్స్. ఈ సీన్ నిజానికి ముందు స్క్రిప్టులో లేద‌ట‌. ఐతే బ‌బ్లూకు ఎలాగైనా ఈ సినిమాలో చిన్న పాత్ర ఇవ్వాల‌ని అనుకుని.. ప‌వ‌నే సెట్లో కూర్చుని ఆ సీన్ రాశాడ‌ట‌. ముందు బ‌బ్లూ కోసం సీన్ పెట్టాల‌ని ప‌వ‌న్ అంటే.. ఇక్క‌డ ఇరికించ‌డం సాధ్యం కాద‌ని అన్నాడట సూర్య‌. కానీ ప‌వ‌న్ ఎలాగైనా అత‌ణ్ని పెట్టాల‌ని ఆలోచించి మ‌రుస‌టి రోజు షూటింగ్‌కు ర‌మ్మ‌ని బ‌బ్లూకు చెప్పాడ‌ట‌. అత‌ను వ‌చ్చే స‌మ‌యానికి సెట్లో కూర్చుని ప‌వ‌న్ ఈ సీన్ రాసి.. అప్ప‌టిక‌ప్పుడు షూట్ చేయించిన‌ట్లు బ‌బ్లూ ఒక యూట్యూబ్ ఛానెల్ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించాడు.