ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందంటే ఏదైనా సినిమా చిన్నదో పెద్దదో బ్రేక్ ఈవెన్ అయిపోయి లాభాల్లోకి వెళ్లిపోయిందంటే ప్రొడక్షన్ హౌస్ తో సహా అందరూ సైలెంట్ అయిపోతారు. ఒకవేళ ఫ్లాప్ అయినా ఇందులో పెద్దగా మార్పు ఉండదు. ఎందుకంటే అదనంగా ఎందుకు తిరిగి ఖర్చు పెట్టుకోవడమనే ఉద్దేశంతో. కానీ నవీన్ పోలిశెట్టి మాత్రం అలా ఆలోచించడం లేదు. తన కొత్త మూవీ మూడు వారాలు పూర్తి చేసుకోబోతూ తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ బస్టర్ కొట్టి ఓవర్సీస్ లో రెండు మిలియన్ మార్కు వైపు పరుగులు పెడుతున్నా సరే అలుపు లేకుండా దేశాలు రాష్ట్రాలు తిరుగుతూనే ఉన్నాడు. తగ్గేదేలే అంటూ ఫ్యాన్స్ ని కలుస్తూనే ఉన్నాడు.
జవాన్ ని తట్టుకుని మరీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఈ ఫిగర్లను సాధించడం వెనుక నవీన్ కష్టం అంతా ఇంతా కాదు. అనుష్క ఏమో బయటికి రాలేని పరిస్థితి. వేరే స్టార్ క్యాస్టింగ్ ఎవరూ లేరు. పోనీ మ్యూజిక్ ఏమైనా నలుమూలలా వినిపించే రేంజ్ లో ఛార్ట్ బస్టర్ అయ్యిందా అంటే అదీ జరగలేదు. కేవలం ఎంటర్ టైన్మెంట్ ప్లస్ ఎమోషన్ ని నమ్ముకుని థియేటర్లలో అడుగుపెట్టింది. నవీన్ పోలిశెట్టి చేసిన మేజిక్ ఫ్యామిలీ ఆడియన్స్ ని కదిలించింది. ముఖ్యంగా వృద్ధులు సైతం రావడం అతని రీచ్ ఏంటో చెప్పకనే చెప్పింది. హిట్టు కోసం తహతహలాడుతున్న యువి బ్యానర్ కి పెద్ద సక్సెస్ దక్కింది.
యూత్ హీరోలు ఈ విషయంలో నవీన్ ని ఫాలో కావాల్సిందే. నటించి పారితోషికం తీసుకోవడం వరకే పరిమితం కాకుండా ఇలా నాన్ స్టాప్ ప్రమోషన్లు చేయడం వల్ల వ్యక్తిగత ప్రయోజనం కంటే నిర్మాతకు కలిగే లాభమే ఎక్కువగా ఉంటుంది. ఆర్ఆర్ఆర్ టైంలో సుమారు సంవత్సరం పాటు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు కేవలం రాజమౌళికి మద్దతు ఇవ్వడం కోసం తమ షూటింగులను వాయిదా వేసుకుని ముంబై నుంచి జపాన్ దాకా విపరీతంగా తిరిగారు. దానికి తగ్గ ఫలితం దక్కింది. ఇప్పుడు తిరిగి నవీన్ పోలిశెట్టి అదే బాటలో నడుస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.