‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను విస్మయానికి గురి చేసిన దర్శకుడు వెంకటేష్ మహా. తెలుగులో ఇలాంటి సినిమా వస్తుందన్న ఊహ కూడా మన వాళ్లకు ఉండేది కాదు. ఇంతటి సహజత్వం, ఇంతటి స్వచ్ఛత సినిమాల్లో అరుదుగా కనిపిస్తుంది.
ఆ సినిమాతో వెంకటేష్ మీద అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఐతే వాటిని తనే తగ్గించేసుకుంటూ రెండో ప్రయత్నంగా ఓ రీమేక్ సినిమా తీశాడు మహా. అదే.. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య.
మలయాళ హిట్ ‘మహేషింటే ప్రతికారం’ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే నెట్ఫ్లిక్స్లో విడుదలై మంచి స్పందనే తెచ్చుకుంది. దీని తర్వాత మహా ఎలాంటి సినిమా తీస్తాడు.. ఎప్పుడు దాని గురించి అనౌన్స్ చేస్తాడని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘సుమతి’ పేరుతో వినాయక చవితి రోజు పొద్దుపోయాక అతను ఆ సినిమా గురించి ప్రకటించాడు.
తన తొలి రెండు సినిమాల్లో నిర్మాణ భాగస్వామిగా ఉన్న పరుచూరి విజయ ప్రవీణతో కలిసే ఈ సినిమాను కూడా స్వయంగా నిర్మించబోతున్నాడు వెంకటేష్ మహా. పల్లెటూరి నుంచి మరో దేశంలోని మహా నగరానికి వచ్చిన పెద్ద వయస్కురాలి కథ ఇది అని ప్రి లుక్ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. ఐతే మహా సన్నిహితుల సమాచారం ప్రకారం ఇది అతడి తల్లి కథే అట.
ఆమె పల్లెటూరి నుంచి పట్నానికి వచ్చాక ఇక్కడ ఎదురైన అనుభవాలకు కొంత కల్పన జోడించి ఈ కథను తయారు చేశాడట మహా. అతడి తొలి సినిమా ‘కేరాఫ్ కంచరపాలెం’ కథ కూడా ఇలా తయారైందే. కంచరపాలెం అనే ఊరికి వెళ్లి ఆరు నెలలు అక్కడే ఉండి, మనుషుల్ని గమనించి పాత్రలు తయారు చేశాడు.
ఇప్పుడు మరోసారి స్వీయ అనుభవాల నుంచే కథ రెడీ చేసుకున్నాడు. ఈ సినిమా పోస్టర్ మీద ‘డెడికేటెడ్ టు అవర్ పేరెంట్స్ అంటూ మహా, ప్రవీణ తమ తల్లిదండ్రుల పేర్లు వేశారు. అందులో గడ్డిగోపుల సుమతి దేవి అంటూ మహా తల్లి పేరు ఉండటం గమనార్హం.