ఎన్నడూ లేనిది కెజిఎఫ్ పుణ్యమాని కన్నడ నుంచి వస్తున్న డబ్బింగ్ సినిమాల శాతం క్రమంగా పెరుగుతోంది. బడ్జెట్ తో సంబంధం లేకుండా అక్కడ మెప్పు పొందినవాటిని మన ప్రేక్షకులకు అందించడం కోసం పెద్ద బ్యానర్లే నడుం కడుతున్నాయి. వాటిలో భాగంగా వచ్చిందే సప్త సాగరాలు దాటి సైడ్ ఏ. అతడే శ్రీమన్నారాయణ, 777 చార్లీతో సుపరిచితుడిగా మారిన రక్షిత్ శెట్టి హీరోగా హేమంత్ రావు దర్శకత్వంలో రూపొందిన ఈ లవ్ ఎమోషనల్ డ్రామా నిన్న ఎలాంటి పోటీ లేకుండా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అండదండలతో థియేటర్లలోకి అడుగు పెట్టింది. ఇంతకీ మూవి ఎలా ఉందంటే
కోటీశ్వరుల ఇంట్లో కారు డ్రైవర్ గా పని చేసే మను(రక్షిత్ శెట్టి), గాయని కావాలని కలలు కనే మిడిల్ క్లాస్ అమ్మాయి ప్రియా(రుక్మిణి వసంత్) ఘాడమైన ప్రేమలో ఉంటారు. ప్రియురాలి స్వంత ఇంటి కోరిక నెరవేర్చడానికి చేయని నేరం నెత్తి మీద వేసుకుని యజమాని కోసం జైలుకు వెళ్తాడు మను. అయితే విధి ఆడిన వింత నాటకంలో అనూహ్య పరిణామాలు జరిగి త్వరగా బయటికి రావడానికి బదులు పదేళ్ల జైలు శిక్ష పడుతుంది. దీంతో నిస్సహాయ స్థితిలో పడిన ప్రియ ఏం చేస్తుందనేదే స్టోరీ. చాలా బరువైన భావోద్వేగాలతో దర్శకుడు హేమంత్ ఒక సిన్సియర్ లవ్ స్టోరీని చెప్పే ప్రయత్నం చేశారు.
కథనం నెమ్మదిగా ఉన్నప్పటికీ లీడ్ పెయిర్ తో ప్రయాణం చేయగలిగితే ఎమోషన్స్ కనెక్ట్ అవుతాయి. అలా కాకుండా సాధారణ ప్రేక్షకుల్లా ఓ మాదిరి అంచనాలు పెట్టుకున్నా సప్త సాగరాలు ఒక దశ దాటాక బోర్ కొట్టేస్తుంది. ఒకే భాగంగా తీసి ఉంటే అన్ని భాషల్లో మెప్పించే క్లాసిక్ అయ్యేదేమో కానీ ఉద్దేశపూర్వకంగా సీక్వెల్ ప్లాన్ చేసుకుని తీయడంతో సగానికి పైగా మూవీ భారంగా కదులుతుంది. ఎంటర్ టైన్మెంట్ లేకపోవడంతో పాటు కీలకమైన ట్విస్టులు సైతం ఫ్లాట్ గా అనిపిస్తాయి. సోషల్ మీడియాలో గీతాంజలి రేంజ్ లో ఊదరగొట్టారు కానీ సప్తసాగరాలు మన ఆడియన్స్ కి ఆ స్థాయిలో అనిపించే కంటెంట్ అయితే కాదు.