మాస్ రాజాతో రష్మిక

టాలీవుడ్లో ఒక కొత్త, వైవిధ్యమైన కాంబినేషన్‌కు రంగం సిద్ధమైంది. మాస్ రాజా రవితేజ.. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా తొలిసారి జట్టు కట్టబోతోంది. గోపీచంద్ మలినేని కొత్త సినిమాలో వీరి కాంబినేషన్‌ను తెరపై చూడబోతున్నాం. రష్మిక.. ఇప్పటిదాకా చాలామంది స్టార్లతో సినిమాలు చేసింది కానీ.. అందులో చాలా వరకు క్లాస్ టచ్ ఉన్న చిత్రాలే. కానీ రవితేజ అంటూ పక్కా మాస్ ఉంటుంది.

గోపీచంద్‌తో అతడి కాంబినేషన్ సూపర్ హిట్ అన్న సంగతి తెలిసిందే. డాన్ శీను, బలుపు, క్రాక్.. ఇలా మూడు సినిమాలూ ఒకదాన్ని మించి ఒకటి విజయం సాధించాయి. ‘క్రాక్’ తర్వాత మల్లీ వీరి కలయికలో సినిమాను అనౌన్స్ చేయగానే మంచి హైప్ వచ్చింది. ఈ చిత్రానికి కథానాయికగా పలు పేర్లను పరిశీలించారు. శ్రుతి హాసన్‌ను రిపీట్ చేయడం.. శ్రీలీలను తీసుకోవడం గురించి కూడా చర్చ జరగింది. కానీ చివరికి రష్మికను ఓకే చేశారు.

రష్మిక ఈ టైంలో నిజానికి నితన్ సరసన వెంకీ కుడుముల సినిమాలో నటించాల్సింది. కానీ ఓ హిందీ చిత్రం కోసం ఆమె ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. దీంతో తన డేట్లు కొన్ని వృథా అయ్యాయి. ఈలోపు నితిన్ సినిమాకు వేరే హీరోయిన్ని తీసుకున్నారు. ఇలాంటి టైంలోనే రవితేజ-గోపీచంద్ సినిమా నుంచి పిలుపు రావడంతో ఆమె సంతోషంగా ఒప్పుకుంది.

కారంచేడు ప్రాంతంలో జరిగిన ఊచకోత నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ‘క్రాక్’ తరహాలోనే వాస్తవ ఘటనల ఆధారంగా కల్పిత కథను తీర్చిదిద్ది మంచి మాస్ సినిమాను అందించబోతున్నాడట గోపీచంద్ మలినేని. గోపీ చివరి సినిమా ‘వీరసింహారెడ్డి’ని ప్రొడ్యూస్ చేసిన మైత్రీ మూవీ మేకర్సే ఈ చిత్రాన్ని కూడా నిర్మించనుంది. ప్రి ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉండగా.. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లనుంది.