బాలయ్య మళ్లీ మిస్సింగ్

తెలుగు సినిమాకు ఒక కన్ను నందమూరి తారక రామారావు అయితే.. మరో కన్ను అక్కినేని నాగేశ్వరరావు. గత ఏడాది ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు సంవత్సరం పాటు సాగాయి. ఈ ఏడాది ఏఎన్నార్ శత జయంతి వేడుకలు మొదలయ్యాయి. సెప్టెంబరు 20న ఏఎన్నార్ 99 జయంతి పూర్తి కాగా.. ఇక్కడ్నుంచి ఏడాది పాటు శత జయంతి వేడుకలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏఎన్నార్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించింది అక్కినేని కుటుంబం.

ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమ నుంచి అనేక మంది ప్రముఖులు తరలివచ్చారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా కొందరు రాజకీయ నేతలూ ఈ వేడుకకు హాజరయ్యారు. మహేష్ బాబు, రామ్ చరణ్, నాని, మోహన్ బాబు, జయసుధ, బ్రహ్మానందం.. ఇలా చాలామంది సినీ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

ఐతే ఈ వేడుకలో మిస్ అయిన వాళ్లు కూడా చాలామందే ఉన్నా.. నందమూరి బాలకృష్ణ రాకపోవడం మరోసారి చర్చనీయాంశం అయింది. ఏఎన్నార్ చనిపోయినపుడు చివరి చూపు కోసం కూడా బాలయ్య రాకపోవడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. నాగార్జునతో ఎక్కడ చెడిందో ఏమో కానీ.. చాలా ఏళ్ల నుంచి ఆయన, బాలయ్య ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. ఇద్దరూ ఎక్కడా కలవడం.. మాట్లాడుకోవడం గత పదేళ్లలో దాదాపుగా జరగలేదు.

ఈ మధ్య ఒక వేడుకలో ‘అక్కినేని తొక్కినేని’ అంటూ బాలయ్య నోరు జారగా.. దాని మీద పెద్ద వివాదమే రాజుకుంది. ఐతే తర్వాత బాలయ్య వివరణ ఇస్తూ.. ఏఎన్నార్‌కు తన పిల్లల కంటే తాను క్లోజ్ అని, ఆయన గురించి తప్పుగా మాట్లాడే ఛాన్సే లేదని చెప్పుకున్నారు. ఆ సంగతి పక్కన పెడితే ఏఎన్నార్ శత జయంతి వేడుకల ఆరంభ కార్యక్రమానికి బాలయ్యను నాగ్ అండ్ ఫ్యామిలీ పిలవలేదా.. లేక పిలిచినా ఆయన రాలేదా అని జనం చర్చించుకుంటున్నారు.