ప్రేక్షకులకు పెద్ద షాక్ ఇచ్చిన ఉపేంద్ర

వెరైటీ సినిమాలు చూడాలనుకునేవారికి ఉపేంద్ర పేరెత్తితే గూస్ బంప్స్ వస్తాయి. 90వ దశకంలో ఓం, ఉపేంద్ర, ఎ, రా లాంటి చిత్రాలతో అతను రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. నటుడిగానే కాక దర్శకుడిగానూ అతను వేసిన ముద్ర ప్రత్యేకమైంది. ఉపేంద్ర దర్శకత్వంలో సినిమా అంటే కథాకథనాలు.. టేకింగ్ ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం అందని విధంగా ఉంటుంది.

‘ఉపేంద్ర’తో తెలుగులోనూ భారీగా ఫాలోయింగ్ సంపాదించుకున్న అతను.. గత 20 దశాబ్దాల్లో డైరెక్ట్ చేసిన సినిమాలు రెండు మాత్రమే. సూపర్, ఉపేంద్ర-2 తప్ప వేరే సినిమాలు చేయలేదు ఉపేంద్ర. చాలా గ్యాప్ తర్వాత అతను ‘యుఐ’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మధ్యే ఒక వెరైటీ వీడియోతో ఈ సినిమా టీజర్ గురించి హింట్ ఇచ్చారు. వినాయక చవితికి సందర్భంగా సోమవారం ‘యుఐ’ టీజర్ కూడా లాంచ్ అయింది.

ఈ టీజర్లో ఏముందా అని ఓపెన్ చేసి.. రెండు నిమిషాల నిడివి మొత్తం చూసిన వారికి మైండ్ బ్లాంక్ అయింది. అందులో వాయిస్‌లు తప్ప.. విజువల్స్ లేవు. ఏదైనా టెక్నికల్ ప్రాబ్లంతో విజువల్ కనిపించడం లేదేమో అని మళ్లీ మళ్లీ ప్లే చేసి చూసినా ఫలితం లేకపోయింది. అసలు విషయం ఏంటంటే.. విజువల్స్ ఏమీ లేకుండా వాయిస్‌లతోనే ఈ టీజర్ రిలీజ్ చేసి షాకిచ్చాడు ఉపేంద్ర.

కేవలం వాయిస్‌లు మాత్రమే విని.. దృశ్యాలు ప్రేక్షకులే ఊహించుకోవాలని.. ఇది ప్రేక్షకుల ఊహా శక్తికి పరీక్ష పెట్టే ఉద్దేశంతో టీజర్ అని ఉపేంద్ర తర్వాత వెల్లడించాడు. ఇప్పుడు ఒక్కో ప్రేక్షకుడు ఒక్కోలా టీజర్‌ను ఊహించుకుని ఉంటాడని.. తర్వాత అసలు విజువల్స్‌ చూపిస్తానని అతనన్నాడు. ఉపేంద్ర రూటే వేరని.. ఇలాంటి ఔట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాలు అతడికి మాత్రమే వస్తాయని అభిమానుల ఉప్పిని కొనియాడుతున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.