ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘ఖుషి’ లాంటి ఆల్ టైం హిట్ తీశాడు సీనియర్ నిర్మాత ఎ.ఎం.రత్నం. దాంతో పాటుగా తమిళ, తెలుగు భాషల్లో ఆయన భారీ చిత్రాలు ఎన్నో తీశారు. కానీ పవన్‌తోనే తీసిన ‘బంగారం’ సహా కొన్ని సినిమాలు ఆయన్ని దారుణంగా దెబ్బ తీశాయి. దీంతో చాలా ఏళ్లు ప్రొడక్షనే ఆపేశారు. కొన్నేళ్లకు పునరామగనం చేసినా మునుపటి ఊపు అయితే లేదు.
తెలుగులో పవన్ కళ్యాణ్ సినిమాతోనే ఆయన పూర్వ వైభవాన్ని సంపాదించాలని అనుకున్నారు. అందులో భాగంగానే క్రిష్ దర్శకత్వంలో భారీ బడ్జెట్లో ‘హరిహర వీరమల్లు’ మొదలుపెట్టారు. పవన్ చేస్తున్న తొలి భారీ పీరియడ్ ఫిలిం కావడంతో దీనిపై ఆరంభంలోనే భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ రకరకాల కారణాలతో ఈ చిత్రం బాగా ఆలస్యం అయిపోయింది. అసలెప్పుడు రిలీజవుతుందో తెలియని అయోమయంలో పడిపోయింది టీం.
ఈ ఆలస్యం వల్ల రత్నం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వందల కోట్లు పెట్టి తీసే సినిమా ఆలస్యం అయితే వడ్డీల భారం మామూలుగా ఉండదు. వచ్చే ఎన్నికల్లోపు సినిమా రిలీజవుతుందని ఈ మధ్య ధీమా వ్యక్తం చేశారు కానీ.. అలాంటి సంకేతాలు ఏమాత్రం కనిపించడం లేదు. పవన్ వల్ల చాలా నష్టపోతున్నప్పటికీ.. అతనే తనకు న్యాయం చేస్తాడని రత్నం ఆశిస్తున్నారు. ఐతే సినిమా ద్వారా ఆయన్ని బయటపడేయం సంగతి తర్వాత కానీ.. ముందు ఆయన ప్రొడక్షన్లో వస్తున్న ఓ చిన్న సినిమాకు సాయపడాలని పవన్ నిర్ణయించుకున్నాడు.
కిరణ్ అబ్బవరం హీరోగా రత్నం తనయుడు జ్యోతికృష్ణ రూపొందించిన ‘రూల్స్ రంజన్’ అక్టోబరు 6న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. విడుదలకు మూడు రోజుల ముందు ఈ చిత్రానికి ప్రి రిలీజ్ ఈవెంట్ చేయనున్నారు. దీనికి పవనే ముఖ్య అతిథి అట. ఓ మోస్తరు బజ్ ఉన్న ఈ సినిమాకు పవన్ రాక కచ్చితంగా ప్లస్ అవుతుందనడంలో సందేహం లేదు. తన వల్ల కష్టపడుతున్న నిర్మాతకు పవన్ చేస్తున్న చిన్న సాయం ఇది అనుకోవచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates