తమిళంలో స్టార్ హీరోగా ఎదిగిన విశాల్‌కు ఒకప్పుడు తెలుగులోనూ మంచి ఫాలోయింగే ఉండేది. కానీ వరుసగా తన సినిమాలు ఫ్లాప్ కావడం.. పైగా అవి రొటీన్ మాస్ మసాలా సినిమాలే కావడంతో తన ఫాలోయింగ్, మార్కెట్ దెబ్బ తిన్నాయి. ఈ మధ్య తన సినిమాలను తెలుగు ప్రేక్షకులు పట్టించుకోవడమే మానేశారు. ఐతే విశాల్ కొత్త చిత్రం మార్క్ ఆంటోనీ మాత్రం క్రేజీ ట్రైలర్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ మీద తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ చూస్తే మాంచి ఎంటర్టైనర్ లాగా కనిపించింది. శుక్రవారం రిలీజైన సీనిమాకు టాక్ పర్వాలేదన్నట్లే వచ్చింది. అనుకున్నట్లే ఈ సినిమాలో కామెడీ బాగా పండింది. ముఖ్యంగా ఎస్.జె.సూర్య పాత్ర.. అతడి పెర్ఫామెన్స్.. తనతో ముడిపడ్డ కామెడీ సీన్లు సూపర్ అనే టాక్ వస్తోంది. కాకపోతే సినిమా మరీ లౌడ్‌గా ఉండటమే అభ్యంతరకరంగా అనిపించింది చాలామందికి.
కొంచెం కుదురుగా.. పద్ధతిగా సినిమా సాగి ఉంటే మార్క్ ఆంటోనీ స్పెషల్ మూవీ అయ్యేది. సినిమాలో విజిల్ వర్తీ మూమెంట్స్ అయితే కొన్ని ఉన్నాయి. అందులో సిల్క్ స్మిత రీక్రియేషన్ సీన్ ఒకటి. ఇది కాక తెలుగులో టాప్ స్టార్లలో ఒకరైన పవన్ కళ్యాణ్ రెఫరెన్స్ ఒక చోట మన ప్రేక్షకుల్లో హుషారు పుట్టించింది. ఈ కథ 90వ దశకంలో నడుస్తున్నట్లుగా చూపించి.. విలన్ ఫ్యామిలీ మెంబర్ ఒకరు సినిమా ఆడిషన్స్‌కు వెళ్తే.. వేరే కుర్రాడిని తీసుకున్నట్లు చెబుతాడు.
తన పేరు పి తో మొదలవుతుందని చెబుతూ.. తర్వాత పవన్ కళ్యాణ్ పేరు చెబుతాడు. అది విని భవిష్యత్తులో ఈ పేరు అందరినీ ఆలోచింపజేస్తుందని ఎస్.జె.సూర్య అనడంతో థియేటర్ హోరెత్తింది. ఇక్కడ పవన్ పేరు వాడినట్లే.. తమిళంలో అజిత్ కుమార్ రెఫరెన్స్ పెట్టారు. అక్కడ రెస్పాన్స్ ఇంకా పెద్ద రేంజిలోనే ఉంది. ఈ సీన్‌కు థియేటర్లలో సందడి నెలకొన్న వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.