ఎప్పటి నుంచో జరుగుతుందని తెలిసిన విషయమే అయినా తెలుగుదేశం జనసేన పొత్తు ఇవాళ అధికారికంగా ప్రకటించాక ఒక్కసారిగా రెండు పార్టీ వర్గాల్లోనూ కొత్త ఉత్సాహం వచ్చేసింది. దాని తాలూకు ప్రభావం సోషల్ మీడియాలో గమనించవచ్చు. చంద్రబాబునాయుడు అరెస్ట్ తర్వాత రాజకీయ పరిణామాలు ఎప్పటికప్పుడు ఊహకందని స్థాయిలో కొత్త మలుపులు తిరుగుతున్నాయి. దానికి తగ్గట్టే పవన్ కళ్యాణ్, బాలకృష్ణలు షూటింగులతో సంబంధం లేకుండా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అర్ధాంతరంగా అటుఇటు తిరగాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఎన్నికలు అయ్యేదాకా ఇంతే.
దీనివల్ల పవన్, బాలయ్యలతో సినిమాలు చేస్తున్న దర్శక నిర్మాతలు పరుగులు పెట్టాల్సిందే. వీలైనంత త్వరగా షూటింగులు చేసుకుని తక్కువ కాల్ షీట్స్ తోనే ఎక్కువ పని జరిగేలా చూసుకోవాల్సిందే. బాబు జైలుకెళ్లిన కారణంగానే భగవంత్ కేసరికి హఠాత్తుగా బ్రేక్ పడింది. లేకపోతే బాలకృష్ణకు సంబంధించిన పార్ట్ మొత్తం పూర్తయిపోయేదట. ఉస్తాద్ భగత్ సింగ్ రీ స్టార్ట్ చేయడం ఆలస్యం పవన్ ఓసారి మంగళగిరి, మరోసారి రాజమండ్రికి వారం గ్యాప్ లో రావాల్సి వచ్చింది. ముందు ముందు వైసిపి ఎత్తుగడలు ఎలా ఉండబోతున్నాయో తెలియదు కాబట్టి ఈ ఇద్దరికీ సినిమాలిక సవాలే.
పవన్ ఇంకా ఓజి పూర్తి చేయాలి. బాలయ్య దసరా తర్వాత దర్శకుడు బాబీ ప్రాజెక్టులో అడుగు పెట్టాలి. ఇది భారీ చిత్రమే. చూస్తేనేమో ఎలక్షన్లు అనుకున్న టైంకంటే ముందు వచ్చే సూచనలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. అలాంటప్పుడు ఖచ్చితంగా వేసుకున్న షెడ్యూల్స్ ప్రకారమే చిత్రీకరణలు జరిగే ఛాన్స్ ఉండకపోవచ్చు. సర్దుబాట్లు కీలకమవుతాయి. హరిహర వీరమల్లు ఎలాగూ వేసవి తర్వాతే కొనసాగేలా ఉంది. బాలకృష్ణకు బాబీతో తప్ప వేరే కమిట్ మెంట్ లేదు. సో రాబోయే ఆరేడు నెలలు పవన్ బాలయ్యలతో సమానంగా దర్శకులు పరుగులు పెట్టాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates